కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. 

–  భద్రతా సిబ్బంది, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పలు
– ఇద్దరు పౌరులను చంపిన ఉగ్రవాదులు
– గాలింపు చర్యలు ముమ్మరం చేసిన భద్రతా సిబ్బంది
– ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్‌, మే5(జ‌నం సాక్షి ) : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో శనివారం ఉదయం భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. సఫకాదల్‌లోని తబేలా ఛట్టాబల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు. దాగి ఉన్న మిలిటెంట్లు కాల్పులు జరపడంతో భద్రతాదళాలు వారిని ఎదుర్కొనేందుకు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఓ ఇంట్లో ముగ్గురు ఉగ్రవాదులు దాగిఉన్న విషయాన్ని తెలుసుకున్న భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా మరికొంద మంది ఉగ్రవాదులు ఉన్నట్లు భావిస్తున్న భద్రతా సిబ్బంది ఎన్‌కౌంటర్‌ను కొనసాగించారు. ఇదిలా ఉంటే మ్ముకశ్మీర్‌లోని బందీపొరా జిల్లాలో లష్కర్‌-ఈ- తైబా అనే ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు ఇద్దరు పౌరులను అపహరించి అనంతరం హత్య చేశారని పోలీసులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి బందీపొరా జిల్లాలోని గుల్షాన్‌ మొహల్లా ప్రాంతంలో గులామ్‌ హసన్‌ దార్‌(45), బషీర్‌ అహ్మద్‌ దార్‌(26) అనే ఇద్దరు వ్యక్తుల ఇళ్లలోకి ఉగ్రవాదులు చొరబడి వారిని అపహరించుకుపోయారని పోలీసులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో వారిద్దరినీ కాల్చి చంపారని చెప్పారు. మసీద సవిూపంలో పడి ఉన్న వారి మృతదేహాలను స్థానికులు గురించినట్లు తెలిపారు. చనిపోయిన వ్యక్తులిద్దరినీ బంధువులుగా గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం లష్కర్‌-ఈ-తైబా ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.