కాశ్మీర్‌లో కొనసాగుతున్న కర్ఫ్యూ

.3

శ్రీనగర్‌,జులై 16(జనంసాక్షి): కశ్మీర్‌ లోయ అట్టుడికి పోతోంది. ఉగ్రవాది బుర్హాన్‌ వని ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో వేర్పాటువాదులు చేస్తోన్న ఆందోళనలతో కశ్మీర్‌లో అల్లకల్లోలం చెలరేగిన విషయం తెలిసిందే. ఆందోళనల నేపథ్యంలో పోలీసులు విధించిన కర్ఫ్యూ గత వారం రోజులుగా కొనసాగుతూనే ఉంది. శనివారం ఏడో రోజు కూడా కశ్మీర్‌ లోయలోని పలు ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు, కార్యాలయాలు మూతపడ్డాయి. వీధుల్లో జన సంచారం లేదు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పలుచోట్ల సైనికులు పహారా కాస్తున్నారు. కాగా, హిజ్బిల్‌ ముజాహిదీన్‌ తీవ్రవాది బుర్హన్‌ వనిని భారత భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన విషయం తెలిసిందే. బుర్హన్‌ ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ వేర్పాటువాదులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు  జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించారు. చొరబాటుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను శనివారం సైన్యం మట్టుబెట్టింది. సరిహద్దుల్లో పహారా ముమ్మరం చేశారు. సరిహద్దుల గుండా ఉగ్రవాదులను చొప్పించేందుకు పాక్‌ పన్నాగాలు పన్నుతోంది.