కాశ్మీర్‌లో జవాన్లపై ఉగ్రదాడి
– ఎనిమిదిమంది జవాన్ల మృతి
జమ్ము,జూన్ 25(జనంసాక్షి):జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ప్యాంపోర్ లో సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లు టార్గెట్ గా మెరుపుదాడి చేశారు. బస్సులో వెళ్తున్న జవాన్లపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సి.ఆర్.పి.ఎఫ్ జవాన్లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ దాడిలో 24 మంది జవాన్లు గాయపడ్డారు. భద్రత బలగాలు తేరుకొని ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇరువర్గాల మధ్య దాదాపు 15 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు లష్కరే తోయిబా కు చెందిన వారని భావిస్తున్నారు. జవాన్లు ఫైరింగ్ రేంజ్ లో ప్రాక్టీస్ కు వెళ్లి వస్తుండగా ఈ దాడి జరిగింది. గాయపడిన జవాన్లను ఆస్పత్రికి తరలించారు.