కాశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదలు హతం


టెర్రరిస్టులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
శ్రీనగర్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి):  జమ్మూ కశ్మీర్‌లో అలజడి సృష్టిస్తున్న ఉగ్రవాదులను టార్గెట్‌ గా చేసుకుని భద్రతా దళాలు ప్రతిచర్యలకు దిగుతున్నాయి.. టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారం అందిన వెంటనే వారిపై అటాక్‌ చేస్తున్నారు. సెర్చ్‌ ఆపరేషన్లు, కూంబింగులతో ఉగ్రవాదులను మట్టుబెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. తాజాగా రెండ్రోజుల్లో ముగ్గురు టెర్రరిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కుల్గాం జిల్లాలోని రెడ్వానీ ఏరియాలో టెర్రరిస్టులకు సెక్యూరిటీ ఫోర్సెస్‌ కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. టెర్రరిస్టుల కోసం ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు. పుల్వామాలో భద్రతా దళాలు జరిపిన ఎన్‌ కౌంటర్లో ఓ హిజ్బుల్‌ కమాండర్‌ చనిపోయిన మరుసటి రోజే కుల్గాంలో మరో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ, పోలీసులు మట్టుబెట్టడం గమనార్హం. పుల్వామా కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదిని ఫిరోజ్‌ అహ్మద్‌ దార్‌ గా గుర్తించారు. ఏ`కేటగిరీ టెర్రరిస్టుగా ఫిరోజ్‌ ను గుర్తించిన సెక్యూరిటీ ఫోర్సెస్‌.. 2018లో షోపియాన్‌ లోని జైన్‌ పొరాలో చోటు చేసుకున్న అటాక్‌ లో అతడ్ని నిందితుడిగా భావిస్తున్నారు. ఈ దాడిలో నలుగురు పోలీసులు మృతి చెందారు. ఈ అటాక్‌ తోపాటు పలు ఉగ్ర కార్యకలాపాల్లో ఫిరోజ్‌ కు హస్తం ఉందని తేలింది. 2017 నుంచి అతడు యాక్టివ్‌ గా ఉంటున్నాడని సమాచారం.