కాశ్మీర్‌ అంశమే కాదు..పార్లమెంటులో మాట్లాడే అవకాశమే లేదు


మోడీ ప్రభుత్వంలో నిరంకుశం తాండవిస్తోంది
అన్ని వ్యవస్థలపైనా దాడి జరుగుతోంది
కాశ్మీర్‌ పర్యటనలో మండిపడ్డ రాహుల్‌ గాంధీ
శ్రీనగర్‌,ఆగస్ట్‌10(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల పక్రియను ప్రారంభించాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. కశ్మీర్‌ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని గులాం నబీ అజాద్‌ తనను కోరానని, అయితే ఏ అంశం మాట్లాడడానికి పార్లమెంటులో అనుమతించడం లేదనే విషయం తాను అందరికీ చెప్పదలచుకున్నానని అన్నారు. పెగాసస్‌, అవినీతి, నిరుద్యోగిత వంటి పలు అంశాలు ప్రస్తావించాలని తాను అనుకున్నప్పటికీ మాట్లాడటానికి తమకు అవకాశం ఇవ్వడం లేదని రాహుల్‌ తప్పుపట్టారు. మంగళవారంనాడు శ్రీనగర్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రెండు రోజుల కార్యక్రమం కోసం, శ్రీనగర్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభించేందుకు ఆయన ఇక్కడకు వచ్చారు..మా కుటుంబం గతంలో అలహాబాద్‌లో నివసించేది. అంతకు ముందు ఇక్కడ శ్రీనగర్‌ ఉన్నారు. నేను ఎక్కువగా ఇక్కడ లేను. అయినప్పటికీ కొంత అహగాహన ఉంది. ఆ విధంగా నాలో కూడా కొంత కశ్మీరీ సంప్రదాయం కశ్మీరియత్‌ఉంది. ఇక్కడ సోదరభావం వెల్లివిరుస్తూ ఉంటుంది. అదే వారి బలం. విద్వేష వ్యాపికి ఇక్కడ ప్రజలు ఏనాటికీ ఒప్పుకోరని రాహుల్‌ ఈ సందర్భంగా అన్నారు. జమ్మూకశ్మీర్‌ మాత్రమే కాకుండా, దేశంలోని అన్ని వ్యవస్థలపైనా ఇవాళ దాడి జరుగుతోందని కేంద్రంపై రాహుల్‌ విమర్శలు గుప్పించారు. న్యాయవ్యవస్థ, లోక్‌సభ, రాజ్యసభ సహా వ్యవస్థలన్నింటిపైనా దాడి జరుగుతోందని ఆరోపించారు. విూడియాను బెదిరిస్తున్నారని, నిజం చెప్పాలంటే విూడియా భయపడుతోందని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో జమ్మూకశ్మీర్‌లో ప్రారంభించిన అభివృద్ధి పక్రియ పూర్తిగా దెబ్బతిందని అన్నారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించి, రాష్ట్రంలో స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. జమ్మూకశ్మీర్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభించడం ఒక కొత్త ఆరంభంగా ఆయన అభివర్ణించారు.
నరేంద్ర మోదీ, ఆయన హింసాయుత సిద్దాంతాలు, విభజన సిద్దాంతాలకు వ్యతిరేకంగా నా పోరాటం సాగుతుంది. విద్యేషం, భయాలకు వ్యతిరేకంగా పోరాడతాను. శాంతి, ప్రేమను చాటి చెప్పే పార్టీ కాంగ్రెస్‌. త్వరలోనే జమ్మూ, లద్దాఖ్‌లో కూడా పర్యటిస్తానని రాహుల్‌ చెప్పారు.