కిక్కిరిసిన కాబూల్‌ విమానాశ్రయం


అఫ్గాన్‌ విడిచి వెళ్లేందుకు భారీగా జనం రాక
తాలిబన్ల పాలనలో ఉండలేమంటూ పరుగులు
కాబూల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): రాజధాని కాబూల్‌ ఎయిర్‌పోర్టు కిటకిటలాడిరది. రైల్వే స్టేషన్‌ లాగా ప్రయాణికులు విదేశాలకు వెళ్లేవారితో విమానాలు కిక్కిరిసి పోయాయి. దేశం ఇప్పటికే తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడంతో సైన్యం చేతులెత్తేసింది. అధ్యక్షుడు రాజీనామా చేసి మరో దేశానికి పారిపోయారు. దీంతో ఆఫ్ఘన్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తాలిబన్ల రాజ్యంలో ఉండలేమంటూ వేల మంది దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం ఉదయం కాబూల్‌ ఎయిర్‌పోర్ట్‌కు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. అక్కడ ఉన్న ఒక్క విమానంలోకే ఎక్కడానికి ఇలా వేల మంది ఎగబడ్డారు.
ఇంత భారీగా తరలి వస్తున్న జనాలను నియంత్రించ లేక అక్కడి మిగిలిపోయిన కొంత మంది అమెరికా బలగాలు గాల్లోకి కాల్పులు జరిపాయి. ఆదివారం ఉదయమే కాబూల్‌లోకి దూసుకొచ్చిన తాలిబన్లు సాయంత్రానికి రాజధానిని తమ ఆధీనంలోకి తీసుకొని ఆఫ్ఘన్‌ అధ్యక్ష భవనాన్ని కూడా ఆక్రమించిన విషయం తెలిసిందే. గతంలో తాలిబన్ల భయానక పాలనను చూసిన ప్రజలు ఇప్పుడు మళ్లీ వాటిని ఊహించుకుంటూ భయాందోళనలతో దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పాకిస్థాన్‌ తమ సరిహద్దులను మూసేసింది. వేలమంది ప్రజలు దేశం వీడేందుకు ఏకంగా విమానాల వద్దకే పరుగులు పెట్టారు. రాజధాని కాబుల్‌ను తాలిబన్లు చుట్టుముట్టారన్న వార్త తెలియగానే నగరవాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాశ్రయాల బాటపట్టారు. దేశంలోని వివిధ రాష్టాల్ర రాజధానులను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో చాలా మంది మొదట కాబుల్‌కు వలసవచ్చారు. ఇక్కడ ప్రభుత్వ బలగాలు ఎక్కువగా ఉండటంతో ముష్కర మూకలను అడ్డుకొంటాయని వారు ఆశించారు. కానీ, ఊహించిన దానికన్నా వేగంగా తాలిబన్లు రాజధానిని చుట్టుముట్టడంతో ప్రజలు ఒక్కసారిగా హతాశులయ్యారు. అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయిన వార్త తెలుసుకోగానే.. వేల మంది నగరవాసులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, మంత్రులు, మహిళలు ప్రాణభయంతో చేతికి అందిన సామగ్రి తీసుకొని దేశం విడిచి పెట్టి
వెళ్లేందుకు విమానాశ్రయం చేరుకొన్నారు. దీంతో హవిూద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పౌర టెర్మినల్‌ కిక్కిరిసిపోయింది. ఒక్కో విమానం వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రజలు ఒక్కసారిగా విమానాల వద్దకు చొచ్చుకురావడంతో అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది గాల్లోకి కాల్పులు జరిపారు. అంతేకాదు, ప్రస్తుతం కాబుల్‌ విమనాశ్రయం తాలిబన్ల గురిలోకి వచ్చిందని అమెరికా దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడిరచింది. అంతేకాదు అమెరికా దౌత్య ఉద్యోగులను హెలికాప్టర్లలో ఎయిర్‌పోర్టుకు తరలించింది. ఎయిర్‌ ఇండియా విమానం 129 మంది ప్రయాణికులతో ఆదివారం రాత్రి దిల్లీకి చేరుకొంది. రాత్రి 8 గంటల సమయంలో ఇది రన్‌వేపై దిగింది. మరోపక్క కాబుల్‌ నుంచి దిల్లీకి వరుసగా విమానాలను నడిపేందుకు ఎయిర్‌ ఇండియా సిబ్బందిని సిద్ధం చేస్తోంది. రెండు విమానాలను అత్యవసరాల కోసం సిద్ధంగా ఉంచింది.