కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి

హైదరాబాద్‌: నవంబర్‌ 12, జనంసాక్షి:
ఎడారి దేశంలో మావాళ్లు ఎరక్కపోయి ఇరుక్కపోయారు..అక్కడా ఎటుచూసినా ఎండమావలే తప్ప ఏడుపును పట్టించుకొనేవారు ఎవరూలేరు..ఏం తిన్నరో ఎట్లున్నరో తెల్వదు..మొఖం చూపే దిక్కు లేదు..ములాఖత్‌ అసలేలేదు..పొట్టకూటి కోసం పరదేశం పోయారు..పనిచేసి పైసలు పంపిస్తమన్నారు..చేయని నేరానికి బంధీలుగా మారారు..కాఠిన్యం తప్ప కారుణ్యం లేని చట్టాల వల్ల కరుకు ఊచలు లెక్క పెడుతున్నారు. ‘పల్లెలో మెతుకు కోసం ఎడారిలో వెతుకులాట..పొట్టకూటి కోసం పోరులో పొరుగుదేశం తోవ పట్టారు..బతుకుబండి కష్టమై గల్ఫ్‌కు వలస పోతే చేయని తప్పు తలకు చుట్టుకుంది..ప్రభుత్వం పట్టించుకోదు, ఎంబసీ సాయం చేయదు..అప్పో సొప్పో చేసి పరదేశం పోయి, చెమటోడ్చి నాలుగు మెతుకులు సంపాదించి కడుపు నింపుతరనుకున్నం..డుపుకింత గంజి పోస్తరనుకుంటే గుండెకోత మిగిల్చారు..దీంతో తమ భర్తలను విడిపించుకోవడానికి తమకు మిగిలిన ఆస్తి కిడ్నీలేనని, కావున మా కిడ్నీలను అమ్ముకునేందుకు అనుమతించాలంటూ కరీంనగర్‌ జిల్లాకు చెందిన మహిళలు హెచ్‌ఆర్‌సిని ఆశ్రయించారు. సోమవారం ఈ సంఘటన హెచ్‌ఆర్‌సీ వద్ద కలకలం సృష్టించింది..ఉదయం హెచ్‌ఆర్‌సీకి వచ్చిన మహిళలు తమ భర్తలు గల్ఫ్‌ జైళ్లలో మగ్గుతున్నారని, వారిని విడిపించుకునేందుకు 15 లక్షలు అవసరమని చెప్పారని పేర్కొన్నారు. మాకు మిగిలిన ఏకైక ఆస్తి మా కిడ్నీలేనని కావున వాటిని అమ్ముకునేందుకు అనుమతించాలని హెచ్‌ఆర్‌సీలో పిటిషన్‌ దాఖలు చేశారు..తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వలస జీవుల గల్ఫ్‌బాధలు ఎవ్వరికీ పట్టవని ఆవేదన వ్యక్తం చేశారు.