కిడ్నీవ్యాధితో జనం పిట్టల్లా రాలిపోతున్నారు

రెండేళ్లలో 103మంది చనిపోయారు.
కిడ్నీ బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వానికి శ్రద్దలేదు
బాధితులకు ప్రతి నెల రూ. 2500 పెన్షన్‌ అందించాలి
ఈనెలాఖరులోపు కృష్ణాజిల్లాలో డయాలసిస్‌ సెంటర్‌లు ఏర్పాటు చేయాలి
లేకుంటే కిడ్నీ బాధితులతో ఆందోళనకు దిగుతాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సి.హెచ్‌ బాబురావు
విజయవాడ, జూన్‌23(జ‌నం సాక్షి): కిడ్నీ వ్యాధితో ఒక్కొక్క కుటుంబంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారుని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌.బాబురావు అన్నారు. పశ్చిమ కృష్ణా మెట్ట ప్రాంతంలో 3 వేల మంది కిడ్నీ బాధితులు ఉన్నారని ఆయన తెలిపారు. శనివారం బాబురావు విూడియాతో మాట్లాడుతూ.. గత రెండున్నర ఏళ్లలో దాదాపుగా103 మంది చనిపోయారని చెప్పారు. ’25మందికిపైగా డయాలసిస్‌ చెయించుకోవాల్సి ఉండగా మందులకు కూడా డబ్బులు లేని పరిస్థతి ఉందన్నారు. కిడ్నీ వ్యాధి మెట్ట ప్రాంతంలోని 15 మండలాలకు విస్తరించిందని, పిల్లలతో సహా అందరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. దాదాపు రూ. 60 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని ఆయన పేర్కొన్నారు.
సీపీఎం నిర్వహించిన సర్వేలో 1284 మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసిందని, ప్రభుత్వానికి దుబారా ఖర్చు పెట్టడంలో ఉన్నా శ్రద్ధ.. కిడ్నీ బాధితులను ఆదుకోవడంలో లేదని ఆయన విమర్శలు గుప్పించారు. దాదాపుగా 1000మంది తమ సొంత భూములను అమ్ముకొని, అప్పులు చేసి కిడ్నీ వ్యాధి కోసం చికిత్స చేయించుకునే పరిస్థితి అని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో  చెందుతున్న జిల్లాలో 15 మండల్లాలో కిడ్నీ వ్యాధితో ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కనిపించలేదా అని బాబురావు ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం స్పందించినా కూడా ఒక డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. తన సొంత నియోజకవర్గంలో ఈ విధమైన
పరిస్థితి ఉన్నా మంత్రి పట్టించుకోకపోవడం బాధాకరమని సీపీఎం నేత అన్నారు. పశ్చిమ కృష్ణాలో కిడ్నీ బాధితులను గుర్తించేందుకు ప్రభుత్వం సమగ్ర సర్వే జరపాలని, అంతేకాక చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్‌ క్రేషియా ఇస్తామని గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ, ఇప్పటి వరకు వారికి రూపాయి కూడా ఇవ్వలేదు.. వైద్య ఖర్చులకు సత్వర ఆర్ధిక సాయాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు. కిడ్నీ బాధితులకు నెలకు రూ. 2500 రూపాయల పెన్షన్‌ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
నూజివీడుతో పాటు తిరువూరు, మైలవరం, నందిగామలలో కూడా డయాలసిస్‌ కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని బాబురావు డిమాండ్‌ చేశారు. వైద్యాశాఖ కూడా సీఎం దగ్గర ఉంది కాబట్టే చంద్రబాబు దీనిపై వెంటనే స్పందించాలని, ఈ నెల చివరిలోపు కృష్ణాజిల్లాలో డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే జూలైలో కిడ్నీ బాధితులతో కలిసి ఉద్యమిస్తామని సీపీఎం నేత బాబురావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.