కిడ్నీ దందాపై.. దర్యాప్తు ముమ్మరం
నల్లగొండ జిల్లాలో కలకలం రేపిన కిడ్నీ దందా రాకెట్ పై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. జిల్లా ఎస్పి దుగ్గల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు.. నిందితులను పట్టుకునేందుకు పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. జల్సాల కోసం సొంత కిడ్నీని అమ్ముకున్న సురేష్ అనే యువకుడు.. ఈ దందా ముఠా సభ్యుడిగా మారి 15 మంది యువకులు కిడ్నీలు అమ్ముకునేలా ప్రేరేపించాడు. బాధితుల కుటుంబ సభ్యుల నుంచి సురేష్ కిడ్నీ వ్యాపారాన్ని తెలుసుకున్న పోలీసులు.. ఈ రాకెట్ వెనుక ఎవరున్నది తెల్చడానికి నడుం కట్టారు.
దాదాపు యేడాదిన్నరగా సురేష్ కిడ్నీ దందాను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు 15 మందిని పావులుగా వాడుకున్న సురేష్.. లక్షల రుపాయలు స్వాహా చేశాడు. నల్లగొండ పట్టణంలో యేడాదిన్నరగా సురేష్ ఈ దందా జరుపుతున్నా.. ఎవ్వరూ గుర్తించకపోవడం హట్ టాపిక్గా మారింది. పేదరికాన్ని క్యాష్ చేసుకొని యువకులను కిడ్నీలు అమ్ముకునేలా ప్రేరిపిస్తున్నాడు. బాధితుల్లో నల్లగొండ జిల్లాకు చెందిన వారితో పాటు హైదరాబాద్, బెంగళూర్, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన దాదాపు 15 మంది ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు సురేష్ ను విచారించే కొద్దీ నిజాలు బయటపడుతున్నాయని పోలీస్ అధికారులు చెప్పారు.
కిడ్నీ రాకెట్ పై విచారణ నివేదికను డీజీపీ అనురాగ్ శర్మకు ఎస్పి దుగ్గల్ అందించారు. శ్రీలంక కేంద్రంగా ఈ దందా నడిచినట్టు అనుమానాలు రావడంతో అక్కడికి వెళ్లి దర్యాప్తు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని ఎస్పి దుగ్గల్.. డీజీపీని కోరారు. మరో వైపు ఈ దందా బయటపడిన తర్వాత.. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు తనకు మత్తు మందు ఇచ్చి కిడ్నీని దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో ఆ యువకుడిని నల్లగొండకు తీసుకవచ్చిన పోలీసులు.. ఈ ముఠాతో కిడ్నీ అపహరణకు ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు ఈ కేసుతో సంబంధం ఉందని అనుమానాలు రావడంతో.. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ తో పాటు ముగ్గురు సీఐలు.. నలుగురు ఐడీ పార్టీ సిబ్బంది.. పది మంది కానిస్టేబుల్స్ బృందాలుగా వీడిపోయి ఇతర రాష్ట్రాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నారు. ఈ కేసులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి, ఓల్డ్ సిటీకి చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పటి వరకు ముఠా సభ్యుడైన సురేష్ తో పాటు కిడ్నీలు అమ్ముకున్న బాధితులు మల్లేష్, నరేష్, హఫీజ్ లను అరెస్టు చేసి వారి నుంచి మరిన్ని వివరాలను రాబడుతున్నారు. అటు కిడ్నీ దందాపై విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. ఈ వ్యవహారం మూలాలను కనిపెట్టడంలో నిమగ్నమయ్యారు.