కిరణ్‌ ముఖ్యమంత్రా ! చప్రాసా ?

అభిప్రాయాల పేరుతో నాటకాలెందుకు
కాంగ్రెస్‌ అధిష్టానంపై నారాయణ ఫైర్‌
హైదరాబాద్‌, ఫిబ్రవరి 4 (జనంసాక్షి):
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం చెప్రాసిగా తిప్పించుకుంటోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. సోమవారం కమ్యూనిస్టు నాయకుడు మఖ్దూం మైనుద్దిన్‌ 105 జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహం వద్ద నారాయణ నివాళులర్పించారు. తెలంగాణ అంశం ఇప్పుడే కేంద్రానికి తెలిసినట్టు మళ్లీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు, మూడు ప్రాంతాల నాయకుల అభిప్రాయాలు తెలుసుకుంటామంటూ నాటకాలు ఆడుతున్నారన్నారు. 1969 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారని, 2004 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2009 డిసెంబర్‌ 9న కేంద్రం తెలంగాణపై ప్రకటన చేసిందని, ఆ తరువాత 23న ఆ ప్రకటన నుంచి వెనక్కి వెళ్లిందని నారాయణ అన్నారు. ఆ తరువాత కేంద్ర హోం శాఖ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిందని, శ్రీకృష్ణ కమిటీ వేసిందని, గత డిసెంబర్‌ 28న మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి జనవరి 28లోగా స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి షిండే చేసిన ప్రకటన కాంగ్రెస్‌ పార్టీ మరిచిపోయిందా అంటూ ప్రశ్నించారు. అనంతరం కేంద్రమంత్రులు పలు సార్లు తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేసేలా ప్రకటనలు చేశారని, మళ్లీ ఇప్పుడు చర్చల ప్రక్రియ అంటే ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. చర్చలు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఉంటే అఖిల పక్ష సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశారని ఈ సమావేశానికి పిలిచి అన్ని పార్టీలను అవమానించేందుకేనా అంటూ నిలదీశారు. తెలంగాణలో ఏం జరుగుతుందో యూపీయే చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీకి, కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్‌కు తెలియవా అంటూ ఆయన ప్రశ్నించారు. ఏదిఏమైనా ముఖ్యమంత్రిని చప్రాసికన్నా అద్వానంగా డిల్లీకి పిలిపించుకుంటూ అవమానిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.