కుంభమేళాలో ‘మహా’ అపశ్రుతి
అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో కూలిన వంతెన
తొక్కిసలాటలోఇరవైమందికి పైగా మృతి
వందల సంఖ్యలో క్షతగాత్రులు
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
కొనసాగుతున్న సహాయ చర్యలు
అలహాబాద్, (జనంసాక్షి) :
మహా కుంభమేళాలో మహా అపశృతి చోటు చేసుకుంది. మౌనీ అమావాస్య మంచి రోజు అని కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అధికారిక లెక్కల ప్రకారం ఆదివారం ఒక్కరోజే మూడు కోట్ల మంది భక్తులు కుంభమేళాకు వచ్చినట్లు సమాచారం. దీంతో అలహాబాద్‌లోని వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అంతేస్థాయిలో అలహాబాద్ రైల్వేస్టేషన్‌కు భక్తులు పోటెత్తారు. దీంతో స్టేషన్ పరిసరాలన్నీ జనసంద్రమయ్యాయి. వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన భక్తులు వేర్వేరు ఫ్లాట్‌ఫాంలకు చేరుకునేందుకు ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిపైకి చేరుకున్నారు. దీంతో బ్రిడ్జి రెయిలింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. బ్రిడ్జిపై స్థాయికి మించి జనాలు ఉండటంతో వందలాది మంది ట్రాక్‌పై పడిపోయారు. కిందపడిన వారిపై వందల మందిపడటంతో సుమారు 20 మందికి పైగా మృతిచెందారు. అసలు ఏం జరుగుతుందో తెలియక తమను తాము రక్షించుకోవాలని భక్తులంతా ఉరుకులు, పరుగులు పెట్టారు. దీంతో తీవ్రస్థాయిలో తొక్కిసలాట జరిగింది. ఫలితంగా వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించేందుకు కూడా స్టేషన్ పరిసరాల్లో స్థలం లేకుండా పోయింది. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగింది. గాయపడ్డ వారిని సకాలంలో ఆస్పత్రికి తరలించలేకపోవడంతో రైల్వేస్టేషన్ పరిసరాలన్నీ హాహాకారాలు, రోదనలతో దద్దరిల్లాయి. సమాచారం అందుకున్న వెంటనే ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పందించారు. రైల్వే శాఖ మంత్రి సహా ఉన్నాతాధికారులు సత్వరమే అలహాబాద్‌కు సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. ప్రమాదం తర్వాత కూడా రైల్వేస్టేషన్ ప్రయాణికుల రద్దీ అలాగే కొనసాగింది. ఎవరికి వారు గమ్యస్థానాలకు చేరుకోవాలనే హడావుడి కనిపించింది. మృతుల కుటుంబాలకు ప్రధాని మన్మోహన్‌సింగ్ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం
అలహాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో ఇంతమంది మృతిచెందడం బాధకరమని అన్నారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు.
ఘటన జరిగిన సమయంలో స్టేషన్‌లో రెండు లక్షల మంది
తొక్కిసలాట జరిగిన సమయంలో రైల్వేస్టేషన్ రెండు లక్షల మంది ప్రయాణికులున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పవన్‌కుమార్ బన్సాల్ ప్రకటించారు. ప్రయాణికుల వివరాలు, ప్రమాదం బారిన పడినవారి క్షేమ సమాచారం కోసం ఢిల్లీ సహా పలు రైల్వేస్టేషన్లలో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రైల్వేశాఖ పరంగా క్షతగ్రాతులు, మృతుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు.