కుదేలవుతున్న దేశ ఆర్థికరంగం
దేశం ఆర్థికంగా బలోపేతం అవుతున్నదన్న ప్రచారం వెనక ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప మరేవిూ కనిపించడం లేదు. గతంలో ఇండియా షైనింగ్ అంటూ ఊదరగొట్టారు. ఇప్పుడు జమిలి ఎన్నికలతో ముందస్తు ఎన్నికలకు పావులు కదుపుతున్నారు. నోట్లరద్దు వ్యవహారం ఇప్పుడు మరోమలుపు తిరిగింది. దాదాపు బ్లాక్ మనీ అంటూ ఏదీ లేదని మొత్తం రద్దయిన నోట్లన్నీ ఖజానాకు చేరాయని ఆర్‌బిఐ ప్రకటించింది. ఈ దశలో కాంగ్రెస్ రాఫెల్ అస్త్రంతో పాటు, జిఎస్టీ, నోట్ల రద్దును ప్రధానంగా ఎంచుకుఇన ప్రచారంలోకి దిగబోతున్నది. నోట్ల రద్దు వల్‌ల దుష్ఫలితాలే తప్ప మంచి ఫలాలు అందలేదన్నది తేలిపోయింది. ఈ దశలో రూపాయి విలువ మరింత క్షీణించింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో పడిపోయి తొలిసారిగా రూ.71కి చేరింది. అమెరికా డాలరుకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు ముడి చమురు ధరలు పెరగడంతో రూపాయి విలువ 26 పైసలు పడిపోయింది. ఇలా ప్రతి నిర్ణయం ప్రజలకు శరాఘాతంగా మారుతోంది. మోడీ ప్రవచించినవి ఏవీ కూడా సానుకూల ఫలితాలు చూపడం లేదని స్పష్టం అవుతోంది. నిరుద్యోగం వంటి ఎన్నో సమస్యలు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో తీవ్ర గాయాన్ని చేయడంపై ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. పెద్దనోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణమనీ, ఈ పక్రియ ద్వారా సామాన్యుల నుంచి డబ్బు దోచుకుని ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టారనీ ఆరోపించారు. నిజంగానే పెద్దనోట్ల రద్దుకు పాల్పడడంపై ప్రధాని మోడీ జాతికి సమాధానం చెప్పి తీరాలి. ఆర్‌బీఐ తాజా నివేదిక ప్రకారం చూసినా రద్దయిన నోట్లలో 99 శాతానికి పైగా తిరిగి బ్యాంకులకు వచ్చేశాయి. నోట్ల రద్దు అనేది పొరపాటు కాదు. అది ప్రజలపై జరిగిన ఉద్దేశపూర్వక దాడిగా ఇప్పటికే ఆర్థికవేత్తలు,విపక్షాలు పెద్దెత్తున విమర్వలకు దిగారు. ఎవరు అవునన్నా కాదన్నా పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ సర్వ నాశనమయింది. నిరుద్యోగం పెరిగిపోయింది. గ్రావిూణ ప్రజల జీవితాలు ఛిద్రం అయ్యాయి. దీనిపై దేశానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోదీపై ఉంది. రిజర్వుబ్యాంకు వార్షిక నివేదిక ఘాటైన నిజాన్ని చెప్పిన తరువాత ఆర్థికమంతంరి అరుణ్‌జైట్లీ ఎంత మొత్తుకున్నా దేశం నమ్మేస్థితిలో లేదు. నల్లధనం, నకిలీ కరెన్సీ, ఉగ్రవాద తీవ్రవాద నిధులు ఇత్యాది రోగాలన్నింటికీ నోట్ల రద్దును రోగనివారిణిగా ప్రకటించినవారు, రద్దయిన నోట్లలో 99.3 శాతం తిరిగొచ్చేసిన తరువాత తమను ఏ మాత్రం సమర్థించు కోలేరు. నోట్లరద్దు నిర్ణయంలో అప్పటి ఎన్నికల రాజకీయం తప్ప ఆర్థికం లేదన్నది ఎప్పుడో తేలిపోయిన విషయం. ఇప్పుడు రిజర్వుబ్యాంకు తేల్చిచెప్పిన దానిలో కొత్త విషయమేవిూ లేదు. ఆలస్యంగా అయినా ఇప్పుడు రిజర్వుబ్యాంకు నోట్లరద్దు విషయంలో నిజాలను వెల్లడించడం ద్వారా మోడీ తీసుకున్న నిర్ణయం ఓ నిరంకుశమైనదిగా భావించాల్సిందే. అయితే ఇప్పటికైనా సవరించుకునే రీతిలో మోడీ ప్రభుత్వం ముందుకు రావడం లేదు. రెండువేల నోటు స్థానంలో వేయినోట్లు ఎందుకు తేవడంలేదన్న దానికి సమాధానం రావడం లేదు. రెండేళ్ళక్రితం దేశం ఎదుర్కొంటున్న సమస్త అరిష్ఠాలను ఏకరువుపెడుతూ ఏకైక పరిష్కారంగా చెలామణీలో ఉన్న పెద్దనోట్లను ఉన్నఫళంగా రద్దుచేయడమే అని ప్రవచించారు. సంపన్నుల ఖజానాల్లో దాగిన నల్లనోట్లు నిగ్గుతేలలేదు. దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్న నకిలీ నోట్ల ఉనికి దొరకలేదు. అవినీతి అంతం కాలేదు, ఉగ్రవాదం ఊపిరిపోలేదు. దీంతో మోడీ అంతర్గతంగా అనుకున్న ఆశయం నెరవేరిందేమో కానీ సామాన్యులు మాత్రం అతలాకుతలం అయ్యారు. చిన్న వ్యాపారాలు చితికిపోయాయి. పెటిఎం, రిలయన్స్ లాంటి సంస్థలు బాగుపడ్డాయి. ప్రజలను బలవంతంగాఅనేక యాప్‌ల వైపు వెళ్లేలా చేశారు. ఈ నిర్ణయం దుష్పభ్రావాలను మాత్రం దేశం ఇంకా అనుభవిస్తూ తేరుకోలేని దుస్థితిలోకి జారిపోయిందన్నది వాస్తవం. పెద్దనోట్ల రద్దు రియలెస్టేట్ రంగాన్ని దెబ్బతీసిందంటే అక్కడ వేళ్ళూనుకున్న అవినీతిని కడిగేసిందంటూ పాలకులు దబాయించారు. నగదు కొరతతో అన్ని రంగాలూ చావుదెబ్బతిన్నాయి. ఇవన్నీ తాత్కాలికమంటూ పెద్దపెద్ద మాటలు చెప్పారు. ఆర్తిక ప్రగతి పరుగులు పెడుతోందని అన్నారు. ఇకపై ఆర్థికరంగం దూకుడును తట్టుకోవడం ఎవరి తరమూ కాదన్నారు.పూర్తిగా నగదు లావాదేవీలతో నడిచే మనదేశంలో మోడీ ఒక్కరి నిర్ణయం కారణంగా భారత ఆర్థికరంగాన్ని భ్రష్టుపట్టింది. రెండేళ్లుగా ప్రజలు దాని నుంచి కోలుకోవడం లేదు. బ్యాంకింగ్ రంగం నిర్వీర్యం అయ్యింది. దినసరి కూలీల బతుకులు బజారుపాల్జేసి, వేలాది చిన్న తరహా పరిశ్రమలను మూసివేయించిన ఘన నిర్ణయంగా చరిత్రలో నిలిచిపోయింది. రద్దు తరవాత డిజిటల్ వైపు పరుగెత్తాలన్న ఒత్తిడి వచ్చినా దేశంలో నగదు చెలామణీ నలభైశాతం హెచ్చిందని కూడా ఇదే ఆర్బీఐ తేల్చేసింది. నల్లధనం వెలుగులోకి రాలేదు. అక్రమంగా దాచుకున్న సొమ్ము ఎంతో తెలియలేదు. రద్దు నిర్ణయం అనంతరం అనేక అక్రమాలు వెలుగు లోకి వచ్చాయి. బ్యాంకు అధికారులనుంచి నాయకులవరకూ అందరూ కలగలిసి అడ్డుతోవల్లో నగదు మార్చిన ఆరోపణలు వెల్లువెత్తాయి. 16వేల కోట్లకు పైగా అక్రమలావాదేవీలు, వెయ్యికి పైగా పట్టుబడిన సంస్థలు, ఇడీ, సీబీఐ ఇత్యాదివి నమోదు చేసిన వందలాది కేసులు, గ్రావిూణ బ్యాంకుల చాటుమాటు వ్యవహారాలూ ఇవన్నీ కూడా నిగ్గుతేలవలసినవే. ఆర్థిక ప్రగతిని దెబ్బతీసిన పెద్దనోట్ల నిర్ణయం ఒక ఘోర చారిత్రక తప్పిదమని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించాలి. పడిపతోతున్న రూపాయిని నిలబెట్టాలి. ఆర్థిక జవసత్వాలు కలిగే నిర్ణయాలు తీసుకోవాలి. ఇకనైనా ఉమ్మడి నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వకుంటే ప్రజలు మరింత నష్టపోతారు. చివరకు తమవంతునిర్ణయం తీసుకుంటారు.