కులవృత్తులకు ప్రోత్సాహం ద్వారా ఆర్థిక ప్రగతి: ఎమ్మెల్యే
నిజామాబాద్,జూలై3(జనంసాక్షి): కులవృత్తులు అంతరించి పోతున్నాయని ఉద్యమ కాలంలో గమనించిన కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటికి ఆదరణ లభించే విధంగా చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ప్రతి కులానికీ న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటూ వలస వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి అంచెలంచెలుగా వాటిని అమలు చేస్తున్నారన్నారు. గొర్ల కాపరులకు రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం వల్ల వారికి ఆర్థిక ఆదెరువు దక్కగలదన్నారు. కులాలను విమర్శిస్తున్న వారు వృత్తుల కనుమరుగువుతున్నాయని గమనించడం లేదన్నారు. కులాల వారీగా సాయం అందించడం అన్నది గ్రావిూణ ఆర్తిక వ్యవస్థను బలోపేతం చేయడమేనని అన్నారు. గత ప్రభుత్వాలు కులవృత్తులకు ప్రాధాన్యత ఇవ్వక అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడడంతో పాటు గ్రావిూణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస వెళ్లారని, ప్రస్తుతం కెసిఆర్ హయాం కుల వృత్తులకు స్వర్ణయుగం అని అభివర్ణించారు. దేశ వ్యాప్తంగా 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారని, అందులో అధికంగా కుల వృత్తుల వారే అన్నారు. అత్యధికంగా ఉన్న బీసీలకు ప్రాధాన్యతను ఇస్తూ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసి బీసీ సబ్ ప్లాన్‌ను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం
చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రస్తుతం రజకులు, నాయీబ్రాహ్మణులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సబ్సిడీపై స్వయం ఉపాధి రుణాలను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇది వరకే రజకులు, నాయీబ్రాహ్మణుల ప్రతినిధులతో సీఎం చర్చించి వారి అవసరాలను ప్రతిపాదించాలని తెలిపారన్నారు. స్వర్ణకారులు ఆర్థికంగా ఎదిగేందుకు బ్యాంకుతో సంబంధం లేకుండా ప్రభుత్వమే రూ.22లక్షలు అందజేసి లబ్ధిదారుని వాటాతో జువెల్లరీ షాపులను స్థాపించేందుకు సహకరిస్తుందన్నారు.