కువైట్‌లో అద్నాన్‌ సమికి చేదు అనుభవం

ముంబయి,మే 7(జ‌నం సాక్షి):  ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమికి అతని బృందానికి కువైట్‌ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. కచేరీ నిమిత్తం అద్నాన్‌ తన బృందంతో కలిసి ఆదివారం కువైట్‌ వెళ్లారు. అయితే అక్కడి విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ‘భారతీయ కుక్కలు’ అని వ్యాఖ్యానిస్తూ అవమానించారట. ఈ విషయాన్ని అద్నాన్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు, కువైట్‌లోని భారత దౌత్య కార్యాలయానికి ట్వీట్‌ చేశారు. ‘ఎంతో ప్రేమతో విూ నగరానికి వచ్చాం. కానీ, విూరు మాకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. అకారణంగా కువైట్‌ ఎయిర్‌పోర్ట్‌లోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు మాతో అసభ్యకరంగా ప్రవర్తించారు. మా వాళ్లని భారతీయ కుక్కలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం గురించి విూకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంత పొగరుగా ప్రవర్తించడానికి వారికి ఎంత ధైర్యం?’ అని అద్నాన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై సుష్మ స్పందిస్తూ.. ‘విూరు నాతో ఫోన్‌లో మాట్లాడండి’ అని ట్వీట్‌ చేశారు. దీనికి ప్రతి స్పందనగా.. ‘మంచి మనసున్న సుష్మ స్వరాజ్‌కు నా ధన్యవాదాలు. ఆమె అర్థం చేసుకుని నాకు, నా బృందానికి సాయం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా మనకు వెంటనే సాయం చేసే సుష్మ మన విదేశాంగ మంత్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాం’ అని అద్నాన్‌ వెల్లడించారు.