కూర్చుంటే కుదరదు.. తెగించి కొట్లాడితేనే తెలంగాణ

అందుకే పోరుయాత్ర : నారాయణ
కరీంనగర్‌ టౌన్‌, అగస్టు31(జనంసాక్షి): కూచుంటే కుదరదని తెగించి కొట్లాడితేనే తెలంగాణ సాధ్యమని, అందుకే పోరుయాత్ర చేపట్టినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ అన్నారు. తెలంగాణ సాధనకై సీపీఐ చేపట్టిన పాదయాత్ర శుక్రవారం కరీంనగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలోని తెలంగాణచౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటకు రోడ్‌మాప్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆత్మబలిదానం చేసుకున్న వారి త్యాగాలు వృధా కావడానికి వీలులేదని, కాంగ్రెస్‌ మెడలు వంచైనా సరే తెలంగాణ సాధించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యా, వైద్యం అన్ని రంగాలలో అన్యాయం జరిగినందునే తెలంగాణ ఉద్యమం ఏర్పడిందన్నారు. ఉద్యమాన్ని అణిచివేయడానికి కేంద్రం దొంగ పాచికలు వేస్తూ కాలం గడుపుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీని అమలు చేయలేదని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. తెలంగాణ ముఖ్యమంటూ బీరాలు పలికిన తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో నిలువ నీడ లేకుండా చేయాలన్నారు. తెలంగాణ ప్రజల ఓపికను పరీక్షించాలనుకుంటే ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతాయని హెచ్చరించారు. తెలంగాణపై జరుగుతున్న కాలయాపన చూస్తూ ఊరుకోలేకే పోరుయాత్ర చేపట్టినట్లు తెలిపారు. గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన యాత్ర కరీంనగర్‌కు చేరుకుందని, సెప్టెంబర్‌ మూడున వరంగల్‌ జిల్లాలో మహా ప్రదర్శనతో పోరు యాత్ర ముగుస్తుందన్నారు. టీజేఏసీ నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అన్న కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలతో కలిసి ఉద్యమించాలని లేకుంటే వారికి తెలంగాణలో పుట్టగతులుండవన్నారు. ఈ యాత్రలో మాజీ రాజ్యసభ నాయకులు అజీజ్‌పాషా, సీపీఐ శాసనసభాపక్ష నాయకులు గుండా మల్లేశ్‌, ఎంఎల్‌సి చంద్రశేఖర ్‌రావు , ఎమ్మెల్యే చంద్రమతి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా నాయకులు మర్రి వెంకటస్వామి, టీజెఎసీ జిల్లా చైర్మన్‌ వెంకటమల్లయ్య, వెంకటేశ్వర్లు, అడ్వకేట్‌ జేఏసీ నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, ఏఐఎస్‌ఎఫ, ఏఐఎస్‌బి, జేఏసీ మహిళా నాయకులు, సీపీఐ నాయకులు, పలు ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఘనస్వాగతం..
అంతకుముందు సీపీఐ పోరుయాత్రకు ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద జేఏసీ జిల్లా నాయకులు, సీపీఐ, అనుబంధ విద్యార్థి సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. మహిళా జేఏసీ నాయకులు మంగళ హారతులతో యాత్రను నగరంలోకి ఆహ్వానించారు. వివిధ ప్రజాసంఘాల నాయకులు, అడ్వకేట్‌ జేఏసీ నాయకులు, సీపీఐ నాయకులు, సీపీఐ అనుబంద పార్టీలకు చెందిన నాయకులు ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద నుండి సభ జరిగే తెలంగాణచౌక్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళా నాయకులు బతుకమ్మలు, బోనాలతో తెలంగాణ సంస్కృతిని చాటారు.