కూలిన అమెరికా సైనిక విమాన

– తొమ్మిది మంది మృతి
– ఘటన పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన ట్రంప్‌
వాషింగ్టన్‌, మే3(జ‌నం సాక్షి) : అమెరికాలో శిక్షణలో ఉన్న ఓ సైనిక విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న సైనిక కార్గో విమానం జార్జియాలో కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. అందులో ప్రయాణిస్తున్న వారెవరూ ప్రాణాలతో మిగలలేదని తెలిపారు. ప్యూర్టోరికో ఎయిర్‌ నేషనల్‌ గార్డ్‌కు చెందిన సీ-130 కార్గో విమానం అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9 గంటల సమయంలో సావన్నా నగర విమానాశ్రయ సవిూపంలో రహదారిపై కూలిపోయి మంటలు చెలరేగాయి. విమానం అధిక భాగం దగ్ధమైపోయింది. విమానంలో తొలుత అయిదుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారని అనుకున్నారు. కానీ తర్వాత అందులో మరో నలుగురు కూడా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. అందరూ ప్రమాదంలో చనిపోయారని ప్యూర్టో రికో నేషనల్‌ గార్డ్‌ అధికార ప్రతినిధి మేజర్‌ పౌల్‌ డాహ్లెన్‌ స్పష్టంచేశారు. మంటలు చెలరేగడంతో విమానం మొత్తం మండిపోయి పెద్ద ఎత్తున పొగలు వెలువడుతున్న ఫొటోలు సోషల్‌ విూడియాలో షేర్‌ చేశారు. విమానం 50ఏళ్ల కంటే పాతదని డాహ్లెన్‌ చెప్పారు. విమానం మెయింటెనెన్స్‌ కోసం జార్జియాలోని డావిస్‌ మంతన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. విమానం మెకానికల్‌ కండీషన్‌ బాగానే ఉందని అన్నారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉందని, ఘటనపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ఘటన పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇటీవల అమెరికాలో పలు విమాన ప్రమాదంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. గత నెలలో ఎఫ్‌-16 విమానం కూలిపోయి పైలట్‌ ప్రాణాలు కోల్పోయారు. అంతకు ముందు రోజు మెరైన్‌ కార్ప్స్‌ హెలికాప్టర్‌ కుప్పకూలి నలుగురు చనిపోయారు.