కూలిన సభావేదిక మెట్లు బోర్లా పడబోయిన బాబు

రక్షించిన గన్‌మెన్లు
కాలికి స్వల్పగాయాలు
గుంటూరు, ఫిబ్రవరి 14 (జనంసాక్షి) :
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు తృటిలో ప్రమాదం తప్పింది. సభా వేదిక మెట్లు కూలడంతో ఆయన తూలిపడ బోయారు. అయితే, భద్రతా సిబ్బంది పట్టుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న చంద్రబాబు గురువారం కొలకలూరులో బీఆర్‌ అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌లను ఆవిష్కరించారు. అక్కడే ఏర్పాటు చేసిన సభా వేదికపైనుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులు స్వీకరిస్తుండగా సభా వేదిక మెట్లు కూలిపోయాయి. దీంతో చంద్రబాబు పడిపోబోయారు. అప్రమత్తమైన సిబ్బంది చంద్రబాబును కిందపడకుండా గట్టిగా పట్టుకున్నారు. దీంతో ఆయన ప్రమాదం నుంచి బయట పడగలిగారు. అయితే, ఆయన కాలికి స్వల్ప గాయమైంది. మరోవైపు, వేదిక మెట్లు ఒక్కసారిగా కూలడంతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. రాజేంద్రప్రసాద్‌ను పార్టీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన నుంచి తేరుకున్న చంద్రబాబు… పాదయాత్ర కొనసాగించేందుకు సిద్ధపడ్డారు. నాలుగడుగులు ముందుకు నడిచే సరికి కాలునొప్పి తీవ్రమైంది. ఆయన ఎడమ కాలు బెణికినట్లు సమాచారం. దీంతో చంద్రబాబుకు వైద్యులు ఫిజియోథెరపీ పరీక్షలు నిర్వహించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపిన డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో చంద్రబాబు పాదయాత్రకు స్వల్ప విరామమిచ్చి బస్సులో విశ్రాంతి తీసుకున్నారు. మరోవైపు, బాబుకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు డాక్టర్లు తెలిపారు. వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వైద్యుల బృందం బయల్దేరింది. వారి సూచనల మేరకు పాదయాత్ర కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ప్రమాద విషయం గురించి టీవీల్లో చూసి తెలుసుకున్న బాబు భార్య భువనేశ్వరి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫోన్‌లో ఆయనతో మాట్లాడి, పరామర్శించారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌ 2న చంద్రబాబు ప్రారంభించిన ‘వస్తున్నా.. విూకోసం’ పాదయాత్రలో పలుమార్లు అపశృతి చోటు చేసుకుంది. బాబు రెండు, మూడుసార్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభలో వేదిక కూలింది. తాజాగా గుంటూరు జిల్లాలోని కొలకలూరులో సభా వేదిక మెట్లు కూలడంతో ఆయన తూలిపడ బోయారు. అయితే, ఈ రెండు ఘటనల నుంచి చంద్రబాబు సురక్షితంగా బయటపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబు నక్సల్స్‌ దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. అప్పట్లో తిరుమల అలిపిరి గేట్‌ వద్ద మావోలు మందుపాతర్లు పేల్చడంతో చంద్రబాబు తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనం కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు.