కృష్టాడెల్టాకు సాగర్ నీటి విడుదల
వివాదంపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి : అఖిల పక్షం
విజయవాడ, జూలై 20 : కృష్ణా డెల్టాకు సాగర్ నీరు విడుదలపై తలెత్తిన న్యాయపరమైన వివాదాన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అఖిల పక్షం డిమాండ్ చేసింది. ఈ నెల 23 లోపు సాగర్ నీటి విడుదలను పునరుద్ధరించాలని లేనిపక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని అఖిలపక్షం హెచ్చరించింది. కృష్ణా డెల్టాకు సాగర్ నుంచి నీటి విడుదలను వ్యతిరేకిస్తూ ఒక రిటైర్డు ఇంజనీర్ హైకోర్టులో పిటిషన్ వేయడం, సాగర్‌లో 510 అడుగుల కన్న నీటిమట్టం తక్కువగా ఉంటే నీటి విడుదల నిలుపు చేయాలని ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణాడెల్టా రైతాంగ సమస్యలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఇక్కడ జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో పలు తీర్మాణాలు చేశారు. 13లక్షల మంది రైతుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని హైకోర్టులో వికెట్ పిటిషన్ తక్షణం దాఖలు చేయాలని అఖిలపక్షం కోరింది. సాగర్‌లో 490 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు కూడా కృష్ణాడెల్టాకు నీటిని విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ నేతలు రాజకీయం చేస్తున్నారని అఖిల పక్షం ఆరోపించింది. ప్రభుత్వం గనక సమర్థవంతంగా వ్యవహరించి సమస్యను పరిష్కరించని పక్షంలో ఆందోళనను ఉధృతం చేస్తామని, 23న జరిగే డిఆర్‌సి సమావేశాన్ని అడ్డుకుంటామని అల్టిమేటం ఇచ్చారు. వ్యవసాయ శాఖ మాజీ మంత్రి వడ్డె శోభానాద్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో టిడిపి ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, కాంగ్రెస్ రైతు నాయకులు కామేశ్వరరావు ఇతర రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.