కృష్ణాడెల్టాకు విడుదల కాని నీరు
విజయవాడ,జూన్15(జనం సాక్షి ): నైరుతి రుతుపవనాలు అంచనాల కన్నా ముందే వచ్చి తొలకరి వర్షాలు కురిసినా కృష్ణా డెల్టాలో సాగునీటిని విడుదల చేయకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. నారుమళ్లు పోసుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు చుక్క నీరువిడుదల చేయలేదు. బ్యారేజీలో ప్రస్తుతం 11.3అడుగులు మాత్రమే నీరు ఉంది. 12అడుగులకు చేరితే తప్ప నీటి విడుదల సాధ్యం కాదు. గోదావరిలోకి వరద నీరు ఇంకా ప్రవేశించకపోవటంతో పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోయడం లేదు. పులిచింతలలోను కేవలం ఒకటిన్నర టీఎంసీల నీరు ఉండటంతో నాగార్జనసాగర్ నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు జలవనరుల శాఖ లేఖ రాసింది. అయితే గోదావరిలో నీరు చేరితే పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఇప్పటికే ప్రకటించారు.