కృష్ణా నదిలోకి దూకి ఇవో ఆత్మహత్య

పరిస్థితులపై దేవాదాయ ఉద్యోగుల ఆందోళన

గుంటూరు,నవంబరు 25 (జనంసాక్షి) : గుంటూరు జిల్లాలో దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి అనిత ఆత్మహత్య చేసుకున్నతీరుపై ఆ శాఖ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దాచేపల్లి మండలం శ్రీనగర్‌కు చెందిన ఈమె (32)ను ఐదు రోజుల కింద నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సస్పెండ్‌ చేశారు. ఓవైపు.. తన శాఖ ఉన్నతాధికారుల వేధింపులు.. ఇప్పుడు అకారణంగా సస్పెండ్‌ చేశారనే మనస్తాపంతో పొందుగుల వద్ద కృష్ణానదిలో దూకి చనిపోయినట్లు తెలిసింది. ఆదివారం మధ్యాహ్నం ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిత ఇటీవలి వరకు గురజాలలోని పాతపాటేశ్వరమ్మ ఆలయానికి ఈవోగా ఉన్నారు. గతంలో రెంటచింతల మండలం దైదా రామలింగేశ్వర స్వామి ఆలయం ఈవోగా పని చేసిన సమయంలో నిధులు గోల్‌మాల్‌ జరిగాయంటూ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖరరావు ఆమెను ఈ నెల 19న సస్పెండ్‌ చేశారు. గతంలో సత్తెనపల్లిలో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. అనితకు, ఆయనకు కొంతకాలంగా విభేదాలున్నట్లు తెలుస్తోంది. పై అధికారుల వేధింపులు, ఆకస్మికంగా సస్పెండ్‌ చేయడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనైనట్లు బంధువులు చెబుతున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.