కెఇతో క్షురకుల చర్చలు విఫలం
వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేమన్న మంత్రి
అమరావతి,జూన్18(జనం సాక్షి): : తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధప్రదేశ్‌లోని పలు ప్రధాన ఆలయాల్లో క్షురకులు చేపట్టిన సమ్మె నాలుగో రోజూ కొనసాగుతోంది. దీంతో ఆయా ఆలయాలకు మొక్కులు తీర్చుకొనేందుకు వచ్చిన భక్తులు తలనీలాల సమర్పణకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖమంత్రి కేఈ కృష్ణ మూర్తి రంగంలోకి దిగారు. నాయీ బ్రాహ్మణ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయీ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని వారు పట్టుబట్టగా.. సీఎంతో మాట్లాడి చెబుతానన్నారు. క్షురకుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగానే ఉందని స్పష్టంచేశారు. ప్రతి టికెట్‌పై పర్సంటేజీని రూ.13 నుంచి రూ.20లకు పెంచనున్నట్టు చెప్పారు. క్షరకులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేమని మంత్రి స్పష్టంచేశారు. వారి సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని, అప్పటివరకు సమ్మెను విరమించాలని సూచించారు. అయితే, ప్రభుత్వం నుంచి స్పష్టమైన హావిూ వచ్చేవరకు తమ సమ్మె కొనసాగుతుందని నాయీ బ్రాహ్మణులు తేల్చి చెప్పారు. సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టంచేశారు.