కెనడాలో భారతీయ రెస్టారెంట్‌లో పేలుడు


– 15 మందికి గాయాలు
– క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
– దర్యాప్తు చేపట్టిన భద్రతా సిబ్బంది
టొరంటో, మే25(జ‌నంసాక్షి) : కెనడాలోని టొరంటో నగర శివారులోని మిస్సిస్వాగా ప్రాంతంలో గల ఓ భారతీయ రెస్టారెంట్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 15 మందికిపైగా గాయపడ్డారు.
స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి 10.30గంటల ప్రాంతంలో ‘బాంబే భెల్‌’ రెస్టారెంట్‌లో ఈ పేలుడు చోటుచేసుకుంది. గాయపడ్డ 15 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. భద్రతాసిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో రెస్టారెంట్‌లోకి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు తమ వెంట తెచ్చిన పేలుడు పదార్థాలను పేల్చేసినట్లు అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. బాంబే భెల్‌ రెస్టారెంట్‌లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో
ఒక వ్యక్తి చేతిలో కవరు ఉందని, వాళ్లు వాటిని పేల్చేసిన తర్వాత అక్కడి నుంచి పరారైనట్లు అక్కడి పోలీసు అధికారులు వెల్లడించారు. సీసీటీవీలో రికార్డయిన వారి ఫొటోలను పోలీసులు ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు. పేలుడు సంభవించిన ప్రాంతం వద్ద భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రదేశాన్నంతా ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
రెస్టారెంట్‌లో పేలుడుపై సుష్మా ట్వీట్‌..
కెనడాలోని టొరంటో నగర శివారులోని భారతీయ రెస్టారెంట్‌లో పేలుడు జరిగిన ఘటనపై కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ శుక్రవారం ఉదయం స్పందించారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్విటర్‌ ద్వారా హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ట్వీట్‌ చేశారు. ‘కెనడాలోని ఒంటారియో మిస్సిస్వాగాలోని భారతీయ రెస్టారెంట్‌ ‘బాంబే భెల్‌’లో ఈ పేలుడు సంభవించింది. టొరంటో కాన్సుల్‌ జనరల్‌, కెనడాలోని ఇండియన్‌ కమిషనర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ అక్కడి విషయాలను తెలుసుకుంటున్నాను. అత్యవసర సమాచారం కోసం 1-647-668-4108 సంప్రదించండి అంటూ సుష్మా స్వరాజ్‌ ట్వీట్‌ చేశారు.