కెన్యాలో ఏడు ఒప్పందాలపై సంతకాలు

5

భారత్‌కు కెన్యా నమ్మకమైన భాగస్వామినైరోబి,జులై11(జనంసాక్షి):

కెన్యాకు భారత్‌ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడుతోన్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో నిలుస్తుందని తెలిపారు. కెన్యాలో అపారమైన అవకాశాలున్నాయని అన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి అంశాల్లో కెన్యాతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా సోమవారం కెన్యాలో పర్యటిస్తున్నారు.  ప్రపంచమంతా ఒకే కుటుంబం వంటిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా కెన్యాలోని నైరోబీ నగరంలో  ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. దశాబ్దాల కిందటే భారతీయులు ఇక్కడికి కూలీలుగా వచ్చారని ప్రధాని అన్నారు. వారు అంతా ఇక్కడి స్థిరపడిపోయారని.. చాలా మంది భారత్‌ తిరిగి రాలేదన్నారు. ఇక్కడి నుంచి వచ్చిన భారతీయులు మాత్రం ప్రతికూల పరిస్థితుల గురించి చెప్పేవారన్నారు. మంచిచెడుల్లో పరస్పరం సహకరించుకోవాలన్నారు. భారత్‌ – ఆఫ్రికా బంధాన్ని బలోపేతం చేయడానికే ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.ఈమేరకు రాజధాని నైరోబీలో అధ్యక్ష భవనం స్టేట్‌ హౌజ్‌లో మోదీకి ఘన స్వాగతం లభించింది. అనంతరం అధ్యక్ష భవనంలో అధ్యక్షుడు ఉరు కెన్యాట్టాతో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్బంగా రెండు దేశాల అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నారు. వ్యాపారం, వాణిజ్యం, రక్షణ రంగంలో సహకారం, డిప్లొమెటిక్‌ పాస్‌పోర్టులు ఉన్న వారికి వీసా మినహాయింపు, డబుల్‌ టాక్సేషన్‌ నిరోధించే ఒప్పందంతోపాటు పలు ధ్వైపాక్షిక అంశాలపై అవగాహన కుదిరింది. తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కెన్యా భారత్‌కు బలమైన మిత్ర దేశమని పేర్కొన్నారు. కెన్యాతో భారత్‌కు సుదీర్ఘ అనుబంధం ఉందని తెలిపారు. వలసవాదానికి వ్యతిరేకంగా రెండు దేశాలు కలిసి చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు.కెన్యా అభివృద్దికి పూర్తిగా సహకరిస్తామని హావిూ ఇచ్చారు. కెన్యా అభివృద్ధి కోసం భారత్‌ తన అనుభవాలను, నైపుణ్యాలను కెన్యాతో పంచుకునేందుకు సిద్దంగా ఉందని తెలిపారు. ఉగ్రవాదం రెండు దేశాలకు ప్రధాన సవాలుగా నిలిచిందన్నారు. తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఇంకా సైబర్‌ భద్రత, మత్తు పదార్థాల రవాణా, మనుషుల అక్రమ రవాణాను నిరోధించడంలో కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు. కెన్యా సైనికులకు అవసరమయ్యే 30 అంబులెన్స్‌లను భారత్‌ కెన్యాకు బహుకరించింది. ఈమేరకు ప్రధాని మోదీ వీటిని కెన్యా అధ్యక్షునికి లాంఛనపూర్వకంగా అందజేశారు