కెసిఆర్ ప్రత్యామ్నాయ ఫ్రంట్‌కు కాలం చెల్లు
జాతీయ ప్రత్యామ్నాయ ప్రయత్నాలపై మౌనం
ఇండియా కూటమి రాకతో కెసిఆర్ దూరం
హైదరాబాద్,సెప్టెంబర్2 జనం సాక్షి : జాతీయ రాజకీయాల్లో కెసిఆర్ వేస్తున్న అడుగులకు ఓ రకంగా బ్రేకులు పడ్డట్లుగానే భావించాలి. ఇండియా కూటమి అవతరించడం, అందులో కెసిఆర్‌ను దూరం పెట్టడం తో ఇక కెసిఆర్‌కు జాతీయ రాజకీయాలకు వెళ్లడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యమనే చెప్పాలి. దీనికి ఇండియా కూటమిలోని నేతలు కెసిఆర్‌ను నమ్మకపోవడమే కారణంగా భావించాలి. తెలంగాణ ఇచ్చిన తరవాత కాంగ్రెస్ పార్టీని దూరంగా పెట్టడమే గాకుండా అవసరం మేరకు బిజెపికి దగ్గరయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ లేకుండా జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించలేమని గుర్తించిన అనేక పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా కెసిఆర్‌ను నమ్మడం లేదని తేలిపోయింది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కెసిఆర్ దారుణంగా దెబ్బతీసారు. ఎన్నికైన ఎమ్మెల్యేలను అధికార పార్టీలో చేర్చుకున్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడినపుడు టీఆర్‌ఎస్ పార్టీ తమ పార్టీలో విలీనమవుతుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియా భావించారు. దానికి తగినట్లే కేసీఆర్ సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి సోనియా గాంధీని కలిశారు. పార్టీ విలీనం ఇక లాంఛనమే అనుకుంటున్న తరుణంలో కేసీఆర్ వ్యూహాలు మారాయి. సొంతంగా ఎన్నికల బరిలోకి దిగడంతోపాటు 2014లో బొటాబొటీ మెజారిటీ సాధించారు. ఆ తర్వాత టీడీపీ, కాంగ్రెస్ పార్టీల భరతం పట్టారు. పదుల సంఖ్యలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో ప్రముఖ నేతలంతా వుండడంతో తెలంగాణలో టీడీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనపడిరది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరింత దూకుడు పెంచారు. 2018లో కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు మాత్రమే రాగా అందులోంచి హుజూర్ నగర్ లో గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన 2019లో పార్లమెంటుకు ఎన్నికవడంతో రాజీనామా తప్పలేదు. మిగిలిన 18 మందిలో ఏకంగా 12 మంది అధికార టీఆర్‌ఎస్ పార్టీ పంచన చేరిపోయారు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోవాల్సిన దుస్థితి తలెత్తింది. మిగిలిన ఆరుగురిలో తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ లో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య కేవలం అయిదుగా తేలింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పూర్తిగా దెబ్బతీయడంలో కేసీఆర్ వ్యూహమే కారణం. ఇపుడు జాతీయ రాజకీయాల్లో బీజేపీయేతర కూటమి అంటూ బయలుదేరిన కేసీఆర్.. వ్యవహార శైలి కారణంగా ఆయనను దూరం పెట్టారు. ఇందుకు కాంగ్రెస్ కూడా కండిషన్ పెట్టిందన్న ప్రచారం ఉంది. స్టాలిన్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేశ్ యాదవ్ వంటి వారిని కలిసి చర్చించినా ఇప్పుడు వారెవరూ కెసిఆర్ పక్షాన లేరు. మొత్తవ్మిూద కేసీఆర్ కలిసిన నేతలంతా ఇప్పుడు కాంగ్రెస్‌తో కలసి ఇండియా కూటమిలో ఉన్నారు. బీజేపీ ముక్త్ భారత్ అన్న కేసీఆర్ అంతిమంగా బిజెపితోనే లోపాయకారిగా సర్దుకుపోయారన్న ప్రచారం ఉంది. బీజేపీ పతనం వల్ల ప్రాంతీయ పార్టీలు బాగా పుంజుకుని, కాంగ్రెస్ పార్టీ వందకుపైగా ఎంపీ సీట్లను సాధిస్తే అప్పుడు ఆ పార్టీ అధికారంలోకి రాగలదు. అప్పుడు కూడా కెసిఆర్‌ను కాంగ్రెస్ నమ్ముతుందన్న నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో దేశప్రజలు బీజేపీని కాదని ప్రాంతీయ, ఉపప్రాంతీయ పార్టీల వైపు మొగ్గుచూపుతారా అన్నది చర్చనీయాంశమే. మొత్తంగా కెసిఆర్ ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను తెలంగాన దాటించడం కష్టమైన పనిగానే భావించాలి. తెలంగానలో ఉన్న వ్యతిరేకతను అధిగమించి మరోమారు అధికారంలోకి రావడం కూడా కష్టమైనందున జాతీయ
రాజకీయాలను ప్రస్తుతానికి కెసిఆర్ పక్కన పెట్టినట్లుగానే భావించాలి.