కేంద్రంలో కేటీఆర్‌ బిజీబిజీ

5

– మంత్రులతో వరుస భేటీలు

న్యూఢిల్లీ,జూన్‌ 27(జనంసాక్షి):కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌తో మంత్రి కెటి రామారావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో స్థాపించనున్న పరిశ్రమలకు పర్యావరణ అనుమతులపై చర్చించారు. అలాగే హరితహారం తదితర కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామని అన్నారు. పర్యావరణ అనుమతుల కారణంగా ఆగిపోయిన పరిశ్రమలకు సంబంధించి తక్షణం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. హరితహారం కింద హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున యొక్కుల నాటే కార్యక్రమం చేపడుతున్నామని దానికి రావాలని జవదేకర్‌ను కెటిఆర్‌ ఆహ్వానించారు. అంతకు ముందు ఆయన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణకు ఫైనాన్షియల్‌ ట్యాక్స్‌ మినహాయింపులు ఇవ్వాలని కోరామని తెలిపారు. దేశంలోని అన్ని ట్రేడ్‌లలాగే హైదరాబాద్‌ ట్రేడ్‌కు సహకారం అందిస్తామని విజ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణకు లెదర్‌ ప్రాజెక్టు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. సెజ్‌కు సంబంధించి ఏపీ, తెలంగాణకు ఒక అధికారి మాత్రమే ఉన్నారని వివరించారు. తెలంగాణకు కమిషనర్‌ను హైదరాబాద్‌లో ఉండేలా చూడాలని కోరామని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణలో సింగిల్‌ బ్రాండ్‌ సెజ్‌లు ఉన్నాయని, మల్టీ ప్రాడెక్టులు రెండు తెలంగాణకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. తెలంగాణకు తీరంలేదని, డ్రైపోర్టు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. పన్నురాయితీ, ఆర్థిక ప్రోత్సాహకాల ప్రకటనపై పురోగతి లేదని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. గతంలో తెలంగాణకు, ఏపీకి కేంద్రం పన్ను రాయితీలు, ఆర్థిక ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశామన్నారు. పన్ను రాయితీ అంశం తమ పరిశీలనలో ఉందని కేంద్ర మంత్రి చెప్పారన్నారు. హైదరాబాద్‌లో ట్రేడ్‌ సెంటర్‌ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరామన్నారు.

తెలంగాణలో రెండు ఇండస్టియ్రల్‌ కారిడార్‌లకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించేలా చూడాలని కోరామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ నిర్మాణానికి రూ.15 వందల కోట్ల నిధులు ఇవ్వాలని కోరామని, తొలి విడతగా రూ.200 కోట్లు కేటాయిస్తామని కేంద్ర మంత్రి తెలిపారని పేర్కొన్నారు. తెలంగాణలో బయోఫార్మాపై దృష్టి పెట్టాలని నిర్మలా సీతారామన్‌ సూచించారని తెలిపారు. తాము కోరిన అన్ని అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు.