కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా ?

` సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి సవాల్‌
` మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్ని అప్పులకుప్పలుగా మార్చారు
` రహదారుల అభివృద్ధి కేంద్రం వేల కోట్లు
` విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి వెల్లడి
నల్లగొండ(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రాష్ట్రం మిగులు బడ్జెట్‌గా ఉందని, ఆ తరువాత అప్పులకుప్పలుగా మార్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులు కేటాయించడం లేదన్నది పూర్తిగా అవాస్తమన్నారు. తెలంగాణకు ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్‌ ప్రభుత్వానికి కిషన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. తెలంగాణలో జాతీయ రహదారుల కోసం లక్షా 20వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని అన్నారు. రూ. 80వేల కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. కేంద్రం నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్‌, మెగా టెక్స్‌ టైల్‌ పార్క్‌, రైల్వే కోచ్‌ తెచ్చామని ఉద్ఘాటించారు. శనివారం నల్గొండలో కిషన్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులి సరోత్తమ్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు. మూడు ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల అకాంక్షల కోసం బీజేపీ పనిచేస్తుందని అన్నారు. రూ. 7వేల కోట్లతో రామగుండంలో యూరియా ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేశారని కిషన్‌ రెడ్డి గుర్తుచేశారు. ఎరువులకు సబ్సిడీ ఇస్తూ రైతులను బీజేపీ ఆదుకుంటుందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు కేంద్రం ఏం ఇచ్చిందని అడగడం ఫ్యాషన్‌గా మారిందని విమర్శించారు. 2014 మిగులు బడ్జెట్‌గా ఉన్న తెలంగాణను పూర్తిగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలే దివాలా తీయించామని ఆరోపించారు. 11 ఏళ్లలో రూ.10 లక్షల కోట్లు రెండు పార్టీలు కలిసి అప్పులు చేశాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. అద్భుతమైన తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని కిషన్‌రెడ్డి విమర్శించారు.