కేంద్రం మెడలు వంచి..
హక్కులు సాధించుకుందాం
– ఉక్కు ఫ్యాక్టరీకోసం రమేష్, రవిలు గట్టిగా పోడుతున్నారు
– రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కు ఫ్యాక్టరీకోసం ఆందోళనలు నిర్వహించండి
– నేడు సైకిల్ ర్యాలీలు, రేపు ధర్నాలు చేపట్టండి
– అవినీతి పార్టీలన్నీ ఒకే వేదికపైకి చేరుతున్నాయి
– గాలి-జగన్-బీజేపీ లాలూచీ ప్రజలకు వివరించండి
– ఆశా వర్కర్ల జీతాలపెంపుపై రేపోమాపో నిర్ణయం తీసుకుంటాం
– స్వామివారి ప్రతిష్ట దిగజార్చేలా రాజకీయాలు సరికాదు
– తెదేపా సమన్వయ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి,జూన్26(జనం సాక్షి): కేంద్రం మెడలు వంచి విభజన హక్కులు సాధించేవరకు రాజీపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి ప్రజాదర్బార్ హాల్లో మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన తెదేపా సమన్వయ కమిటీ సమావేశం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ ముఖ్యనేతలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో కేంద్రాన్ని అడగాల్సినవి అన్నీ అడిగానని ముఖ్యమంత్రి నేతలకు తెలిపారు. కడప ఉక్కు కర్మాగారం విషయంలో సీఎం రమేష్, బీటెక్ రవి గట్టిగా పోరాడుతున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. బీటెక్ రవి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీ అంశంలో గాలి జనార్థన్ రెడ్డి అండ్ బృందం నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అవినీతి పరులను కట్టడి చేయలేని స్థితిలో బీజేపీ ఉందని, అవినీతి పార్టీలన్నీ ఓ వైపు చేరాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆందోళనలు నిర్వహించాలని పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. బుధవారం సైకిల్ ర్యాలీలు, గురువారం ధర్నాలు చేపట్టాలన్నారు. ప్రజల్లో అవగాహనను పెంచి చైతన్య పరచాలన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ సొంత మైక్‌లా, బీజేపీ అద్దె మైక్‌లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ-వైసీపీ దొంగాటలు బయటపెట్టాలని, గాలి-జగన్-బీజేపీ లాలూచీ ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. బీజేపీ నేత ఆకుల సత్యనారాయణ-వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీ కలయిక గురించి ప్రజలకు తెలపాలన్నారు. ఈనెల 28న ఢిల్లీలో ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలోను ధర్నాలు కొనసాగాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరసన సెగ ఢిల్లీని తాకాలన్నారు. వైకాపా ఎంపీలు ఉపఎన్నికలు తప్పించుకోటానికే రాజీనామా డ్రామాలు ఆడారని దుయ్యబట్టారు. శ్రీవారి నగల ప్రదర్శన చేయడం మంచిదికాదని పూజారులు చెబుతున్నారని, స్వామివారి ప్రతిష్ట దిగజార్చేలా రాజకీయాలు చేయడం సరికాదని బాబు హితవుచెప్పారు. అంగన్‌వాడీలు, ¬ంగార్డులు, వీఆర్‌ఏల జీతాలు పెంచామని, ఆశా వర్కర్ల జీతాల పెంపుపై రేపోమాపో నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. 62వేలమందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని చెప్పారు. అవినీతిపై అందరూ మాట్లాడాలని, ప్రతి ఒక్కరూ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని చంద్రబాబు హావిూ ఇచ్చారు.
———————