కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా ` రాష్ట్రవ్యాప్తంగా చావుడప్పులతో నిరసనల హోరు


` సీఎం కేసీఆర్‌ పిలుపుతో ఊరూవాడా కేంద్రం తీరుపై ఆందోళనలు
` పలుచోట్ల ప్రధాని మోడీ దిష్టిబొమ దహనం
` తక్షణం ధాన్యం కొనాలంటూ నేతల డిమాండ్‌
హైదరాబాద్‌,డిసెంబరు 20(జనంసాక్షి):ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ నేతలు కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఎక్కడిక్కడ ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహించారు. బిజెపిని ఎండగడుతూ పలుచోట్ల ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మేడ్చల్‌ మండల పరిధిలోని గౌడవెళ్ళి గ్రామంలో వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను టీఆర్‌ఎస్‌ నేతలు దహనం చేశారు. శంషాబాద్‌ నర్కుడ గ్రామంలోటీఆర్‌ఎస్‌ నిరసనలు కొనాసగాయి. రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ జడ్పీటీసీ నిరటి రాజు ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను ఊరేగిం పుగా నిర్వహించారు. అనంతరం టిఆర్‌ఎస్‌ నాయకులు రైతులు నర్కుడ చౌరస్తా లో మోడీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఇటు నిర్మల్‌ జిల్లాలో కూడా చావు డప్పు కార్యక్రమం నిర్వహించారు టీఆర్‌ఎస్‌ శ్రేణులు. నిర్మల్‌ జిల్లా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ కార్యాలయం నుండి మంచిర్యాల చౌరస్తా వరకు టిఆర్‌ఎస్‌ నిరసన ర్యాలీ చేపట్టింది. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ, కేంద్రం ప్రభుత్వ దిష్టి బొమ్మలను మంత్రి దగ్ధం చేశారు. వరంగల్‌ జిల్లాలో కూడా నిరసనలు కొనసాగాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి వినూత్న ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌,నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. స్వర్గ రథంపై ఊరేగించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖిలా వరంగల్‌లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ నేతృత్వంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ శవయాత్ర చూపరులను ఆశ్చర్యపర్చింది. ఒక మనిషి చనిపోతే ఎలా శవయాత్ర చేస్తారో.. అచ్చం అలాగే కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో ఊరేగించారు. ఈ శవయాత్రలో పాల్గొన్న వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ బీజేపీ నాయకులు ఇండియాలో తాలిబన్లను తలపిస్తున్నారని ఆరోపించారు. దీంతోపాటు దేవరుప్పుల మండలంలో రైతులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వినూత్న నిరసనతెలిపారు. కేందప్రభుత్వ దిష్టిబొమ్మను శవపేటికపై పెట్టి చావుడప్పులతో అంతిమ యాత్ర నిర్వహిస్తూ వినూత్న నిరసన చేశారు. యాసంగి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌ మెట్‌ లో విజయవాడల జాతీయ రహదారిపై చావు డప్పు కార్యక్రమం నిర్వహించారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. అటు మహబూబాబాద్‌ జిల్లాలో కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో డోర్నకల్‌ ,మరిపెడ, కురవి, మండలాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా శవ యాత్ర..దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎంపీ కవిత,ఎంఎల్‌ఏ రెడ్యానాయక్‌ పాల్గొన్నారు. జిల్లాలోని నర్సింహులపేట మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మకు శవయత్ర నిర్వహించారు. దిష్టి బొమ్మ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు దహనం చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో కూడా ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం పోరుబాట పట్టింది. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ పిలుపుమేరకు సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గ్రామగ్రామాన నిరసనలు హోరెత్తాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ దిష్టిబొమ్మను రైతులు దగ్ధం చేశారు. రైతులకు మద్దతుగా టీఆర్‌ఎస్‌ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.తెలంగాణ ప్రభుత్వం నుంచి బియ్యాన్ని కేంద్రమే సేకరించాలని డిమాండ్‌ చేశారు. రైతు వ్యతిరేక విధానా లను అవలంభిస్తూ.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం తక్షణం గద్దె దిగాలని రైతులు శాపనార్థాలు పెట్టారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్లగొండ జిల్లావ్యాప్తంగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ రైతులు, పార్టీ కార్యకర్తలు గ్రామగ్రామాన ఆందోళనల బాటపట్టారు. ఉదయం నుంచే గ్రామాల్లో రైతులు చావు డప్పు వేస్తూ కేంద్రం దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారు. కొన్నిచోట్ల రైతులు కల్లాల వద్దే వరిగడ్డితో దిష్టిబొమ్మను రూపొందించి తగులబెట్టారు. కేంద్రం, బీజేపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆందోళనల అనంతరం ఉదయం 11 గంటల నుంచి ముఖ్య కూడళ్లలో ధర్నాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.త్రిపురారం మండలంలోని బడ్డాయిగడ్డలో వరి కళ్లాల వద్ద రైతులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. హుజూర్‌నగర్‌ మండలం శ్రీనివాసపురంలో రైతులు ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాల్చివేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు మండలం రహీంఖాన్‌పేటలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్‌ నాయకులు దగ్ధం చేశారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్‌ గోసాయిపల్లిలో రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించి దగ్ధం చేశారు. వెంటనే వడ్లు కొనాలని డిమాండ్‌ చేశారు. వరిధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతీరుకు నిరసనగ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో గ్రామస్థాయి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ ఆందోళనలు నిర్వహిస్తున్నది. బీజేపీ శవయాత్ర, ప్రధాని దిష్టి బొమ్మలను దహనం చేశారు. జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం ఓగులపూర్‌లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు చావు డప్పు కొడుతూ వడ్ల కొనుగోలుపై కేంద్రం తీరుపై నిరసన తెలిపాయి. పెగడపల్లి మండలంలో రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు.