కేంద్రబడ్జెట్‌లో తెలంగాణకు మొండిచెయ్యే..
` భాజపా నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి
` తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం
హైదరాబాద్(జనంసాక్షి): భాజపా నేతలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 8 స్థానాల్లో గెలిస్తే.. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు మాత్రం సున్నా.. అని విమర్శించారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడారు.‘‘దేశంలో రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో తొమ్మిదో స్థానానికి పడిపోయింది. మెట్రోకు నిధులు అడిగితే ఇవ్వడం లేదు. మూసీ పునరుజ్జీవానికి నిధులు అడిగితే రూపాయి ఇవ్వలేదు. విభజన చట్టంలోని హామీల గురించి కేంద్ర మంత్రులు ఏనాడైనా మాట్లాడారా? మతతత్వ రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించరు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లను ఆమోదించేందుకు కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు? గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్ కల్పించడం లేదా? తెలంగాణ ప్రాజెక్టుల గురించి భాజపా నేతలు ఒక్కసారి కూడా మాట్లాడలేదు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వానిది సవతితల్లి ప్రేమ. భారాస, భాజపా మధ్య ఎప్పుడూ రహస్య బంధం ఉంటుంది. పదేళ్ల పాలనలో భారాస వేల ఎకరాలు అమ్ముకుంది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు?గత ప్రభుత్వ లక్ష ఎకరాలు డీఫారెస్ట్ చేస్తే ఎందుకు ప్రశ్నించలేదు?’’ అని నిలదీశారు.