కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ రాజీనామా

కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ రాజీనామా

ఢిల్లీ, జూన్‌ 26 (ఎపిఇఎంఎస్‌): కేంద్ర మంత్రి వీరభద్ర సింగ్‌ రాజీనామా వీరభద్రసింగ్‌ మంగళవారంనాడు తన పదవికి రాజీనామాచేశారు.ఈ ఉదయం ఆయన ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌తో భేటీ అయి దాదాపు ఇరవై నిమిషాలపాటు మాట్లాడారు. అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రధానికి చెప్పారు. ఆయన ఇచ్చిన రాజీనామా లేఖను ప్రధాని వెంటనే ఆమోదించారు. అనంతరం ఆ లేఖను రాష్ట్రపతికి పంపించారు. ప్రధానిని కలుసుకున్న అనంతరం వీరభద్రసింగ్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను ఏ పాపం ఎరుగనని, ఆరోపణలు వచ్చాయి. కాబట్టి నైతిక ధర్మంతో పదవికి రాజీనామా చేశానని వివరించారు. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో తాను గట్టిగా పోరాడి తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటానని  ఆయన చెప్పారు. ఆరోపణలు వచ్చినప్పుడు పదవిలో కొనసాగడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ పరిస్థితిని రానివ్వరాదని భావించడం వల్లే పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన వివరించారు.
వీరభద్ర సింగ్‌ 1989లో హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడినట్టు సిమ్లా కోర్టు సోమవారం నాడు అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించిన అభియోగ పత్రాలు కూడా సిద్ధం కావడంతో వీరభద్రసింగ్‌కు రాజీనామా తప్ప మరో మార్గం లేకపోయింది. వీరభద్ర సింగ్‌ అక్రమాలకు పాల్పడినట్టు గతంలో  ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన అన్ని ఆరోపణలనూ తీవ్రంగా ఖండించారు. అయితే ఆయన అవినీతికి సంబంధించి ఆయన స్వయంగా మాట్లాడిన అంశాలు రికార్డు రూపంలో కోర్టు దృష్టికి రావడంతో కోర్టు కూడా వాటిని విశ్వసించడంతో వీరభద్రకు పదవిని వీడక తప్పలేదు. సోమవారం నాడు కూడా వీరభద్ర సింగ్‌ కార్యాలయం కోర్టు ఆదేశాల విషయంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని, వీరభద్రకు ఎటువంటి అవినీతి ఆరోపణలతోనూ సంబంధం లేదని పేర్కొన్నది. అయితే వీరభద్రకు వ్యతిరేకంగా ఆధారాలు బలంగా ఉండడంతో ఆయన పదవి నుంచి వైదొలగక తప్పలేదు. వీరభద్రమళ్లీ త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి పదవిని అలంకరించాలన్న కోరిక ఉంది. ఇప్పుడు తీవ్రమైన అవినీతి ఆరోపణలపై ఆయన కేంద్ర మంత్రి పదవిని వదులకోవలసి రావడంతో ఆయన నిరాశ నిస్పృహలకు లోనయ్యారు