కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగానే..  నాపై ఐటీ దాడులు


– కేసీఆర్‌ అభద్రతాభావానికి గురవుతున్నారు
– మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే కాంగ్రెస్‌ నేతలపై దాడులు జరుగుతున్నాయి
– 2009 తరువాత తాను ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదు
– మార్కెట్‌ విలువలు పెరగడంతోనే ఆస్తుల విలువ పెరిగింది
– మాఇంట్లో కిరాయికి ఉన్నవాళ్ల కంపెనీలు నాయంటూ విషప్రచారం చేస్తున్నారు
– అండమాన్‌ జైల్‌లో వేసినా కేసీఆర్‌ అవినీతిపై పోరాటం సాగిస్తా
– రేపటి నుంచే ప్రజల్లోకి కేసీఆర్‌ భాగోతం వివరిస్తా
– ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు కేసీఆర్‌ సిద్ధమా?
– 24గంటలు గడువు ఇస్తున్నా..
– స్పందించకపోతే కేసీఆర్‌ అవినీతిపరుడని ప్రజలే అర్థం చేసుకుంటారు
– కేసీఆర్‌కు కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి సవాల్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగానే తనపై ఐటీ దాడులు జరిగాయని తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రెండు రోజులపాటు తనపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం రేవంత్‌ విూడియాతో మాట్లాడారు.. కేసీఆర్‌ అభద్రతాభావానికి గురవుతున్నారని, ప్రగతిభవన్‌లో భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారని ఆయన అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు తెరాస నేతలు కాంగ్రెస్‌ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలపై తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇంటిని తన కుటుంబసభ్యులు కొనుగోలు చేశారని తెలిపారు. 2014లో బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోవడమే కాకుండా నిర్మాణానికి రుణాలు తీసుకున్నారని వెల్లడించారు. బినావిూ పేర్లతో వ్యాపారాలు చేసినట్లు తనపై ఆరోపణలు చేస్తున్నారని.. మలేసియా, సింగపూర్‌లో వ్యాపారాలు చేసినట్లు పేర్కొంటున్నారని మండిపడ్డారు. ఆయా దేశాల్లో ఖాతాలు తెరవాలంటే ఆ దేశ పౌరుడై ఉండాలని వివరించారు. తన కుటుంబాన్ని క్షోభకు గురిచేసే విధంగా విూడియాలో వార్తలు వస్తున్నాయని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 2009, 2014లో తాను ఈసీ ముందు పొందుపరిచిన ఆస్తుల వివరాలు పోల్చి చూడాలని కోరారు. 2009 తర్వాత తాను ఎక్కడా ఆస్తులు కొనుగోలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. గోపన్‌పల్లి, వట్టినాగులపల్లి, కొండారెడ్డి, కొడంగల్‌లో ఆస్తులన్నీ ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచామని వివరించారు. మార్కెట్‌ విలువలు పెరగడంతోనే తన ఆస్తుల విలువ పెరిగిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రెండు అఫిడవిట్‌లలో పేర్కొన్న వివరాలను పక్కన పెట్టుకొని, తన ఆస్తులేమైనా పెరిగాయోలేదే చూస్తే అర్థం అవుతుందన్నారు. హైదరాబాద్‌లోని తన నాలుగు అంతస్తుల బిల్డింగ్‌ని 22ఏళ్లుగా కిరాయిలకు ఇస్తున్నామని తెలిపారు. కిరాయికి వచ్చిన వారి పేర్ల విూద ఉన్న కంపెనీలు కూడా తనవే అని విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు పిల్లను ఇచ్చిన మామ పద్మనాభ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు బినావిూలు అంటున్నారని నిప్పులు చెరిగారు. తనకు పిల్లను ఇచ్చిన మామ కిరోసిన్‌ ¬ల్‌సేల్‌ డీలర్‌ అని.. 1992 కంటే ముందే ఆయనకు హైదరాబాద్‌లో భూములు ఉన్నాయని రేవంత్‌ వివరించారు. చాలా ఏళ్ల క్రితమే మాడ్గుల గ్రామానికి చెందిన
తన మామ పద్మనాభరెడ్డి ఆయన తండ్రి దుర్గా రెడ్డి కోటీశ్వరులని, కావాలంటే ఆ ఊరు వెళ్లి విచారించమన్నారు. తాను పుట్టక ముందే, తన మామ పుట్టక ముందే వారి కుటుంబం 1940 కాలం నాటికే కోటీశ్వరులా కాదా విచారణ చేయండి అని తెలిపారు. అలాంటి వారిని తీసుకొచ్చి తన బినావిూలుగా చిత్రీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తనపై కుట్రలకు పాల్పడుతున్నాయని రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు అంటే పగ అని, రాష్ట్రంలో కేసీఆర్‌ రేవంత్‌రెడ్డి అంటే పగ అని… వీరంద్దరికీ ఒకటై వారివారి శత్రువులపై దాడులకు పురిగొల్పుతున్నారని అన్నారు. తనపై ఫిర్యాదు చేసిన రామారావు అనే వ్యక్తి కేసీఆర్‌ వదిలిన బాణం అని అన్నారు. కొందరు కేసీఆర్‌ ప్రాపకం కోసం అత్యుత్సాహం చూపిస్తున్నారని, చివరికి వారికే చిప్పకూడు మిగులుందని, కేసీఆర్‌ నిలువునా వారిని వాడుకొని మోసం చేస్తారని రేవంత్‌ హెచ్చరించారు. కొందరు విూడియా మిత్రులుసైతం కేసీఆర్‌కు బానిసలుగా మారారని అన్నారు. కొన్ని పేపర్లు, ఛానళ్లు తాను వందకోట్లు అవినీతికి పాల్పడినట్లు వార్తలు రాస్తున్నారని, ఇది సరికాదని రేవంత్‌ సూచించారు. ఏదైనా రాసేముందే నిజానిజాలను బేరీజు వేసుకోవాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు. కేసీఆర్‌ పోలీస్‌ యంత్రాన్ని, అధికారులను వాడుకుంటున్నారని, వారి ద్వారా కాంగ్రెస్‌ నేతలపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి, మరికొందరు అధికారులు కేసీఆర్‌ కనుసన్నల్లో నడుస్తున్నారని, అనవసరమైన చర్యలకు పూనుకుంటున్నారని ఇలాంటి చేష్టలు సరికాదన్నారు. కుట్రలకు భయపడే వ్యక్తిని కాదని, కేసీఆర్‌ కుట్రలు, కుతంత్రాలు, అవినీతిపై ప్రజల్లోకి వెవరిస్తానన్నారు. రేపటి నుంచే ప్రజల్లోకి వెళ్తానని, కేసీఆర్‌ మిషన్‌ భగీరథ, ప్రాజెక్టుల్లో చేసిన అవినీతిని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. కుట్రలను తిప్పికొట్టడానికి పగలు, రాత్రి అనే తేడా లేకుండా తనకు అండగా ఉన్న పార్టీ కార్యకర్తలకు రేవంత్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి సమయంలో తనకు మద్దతుగా నిలిచిన పార్టీ నేతలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, పొన్నం, డీకే అరుణ, కోమటిరెడ్డి సోదరులు తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సిట్టింగ్‌ జడ్జ్‌ తో విచారణ సిద్ధమా..?
తన ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమని రేవంత్‌ ప్రకటించారు. అయితే కేసీఆర్‌ కుటుంసభ్యులు కూడా దీనికి సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరారు. ‘తాను ఎమ్మెల్సీగా  ఎన్నికైన నాటి నుంచి తన ఆస్తులపై, నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నీ ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ కోసం ప్రధాని మోదీకి లేఖ రాద్దామని, లేఖ రాసేందుకు 24 గంటలు సమయం ఇస్తున్నానన్నారు. 24 గంటల్లో నా సవాల్‌కు బదులు ఇవ్వకుంటే కేసీఆర్‌ అవినీతి పరుడని ప్రజలకు అర్థమవుతుందని రేవంత్‌ అన్నారు. కేసీఆర్‌, ఆయన కుటుంబం చేసిన అవినీతి బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాననే తనపై కక్షపూరితంగా ఐటీ, సీబీఐ దాడులకు ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరితో దాడులు చేయించినా వాటిని తాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.