కేజ్రీవాల్‌ జైట్లీ పరువునష్టం దావా

3

– అవినీతిపై విచారణకు ఆదేశించిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) నిధుల దుర్వినియోగం ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ మధ్య పోరాటం సాగుతోంది. తనతో పాటు తనకుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేసిన కేజ్రీవాల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) నాయకులు కుమార్‌ విశ్వాస్‌, అశుతోష్‌, సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చద్దా, దీపక్‌ వాజపేయిలపై సోమవారం పరువునష్టం దావా వేయనున్నట్టు జైట్లీ వెల్లడించారు. వ్యక్తిగత ¬దాలోనే కేసు పెట్టనున్నట్టు తెలిపారు. కాగా, డీడీసీఏ ఆర్థిక అవకతవకలపై విచారణకు కేజ్రీవాల్‌ ఆదేశించారు. గోపాల సుబ్రహ్మణ్యం నేతృత్వంలో కమిటీ విచారణ చేపట్టనుందని కేజ్రీవాల్‌ తెలిపారు. కేజ్రీవాల్‌, జైట్లీ వ్యూహప్రతివ్యూహాలతో హస్తినలో రాజకీయాలు వేడెక్కాయి.

డీడీసీఏపై విచారణకు ఆదేశం

ఢిల్లీ, డిస్ట్రిక్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ)లో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై విచారణకు ఆదేశించారు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. గతంలో డీడీసీఏ కు అరుణ్‌ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారీ ఎత్తున అవతవకలు జరిగాయనేది కేజ్రీవాల్‌ ప్రధాన ఆరోపణ. డీడీసీఏలో 2013 వరకూ 13 సంవత్సరాల పాటు అరుణ్‌ జైట్లీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన అవినీతికి పాల్పడటంతో పాటు అందుకు ఢిల్లీ క్రికెట్‌ బాడీలోని సభ్యులు సహకరించారని కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. విచారణ కమిషన్‌ కు రాజ్యాంగ నిపుణుడు గోపాల్‌ సుబ్రహ్మణ్యం నేతృత్వం వహించనున్నారు. కమిషన్‌ కు నేతృత్వం వహించాలని తాను కోరగా, గోపాల్‌ సుబ్రహ్మణ్యం అంగీకరించారని కేజ్రీవాల్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. కాగా, అంతకుముందు కూడా డీడీసీఏలో అవినీతి అంశానికి సంబంధించి కేజ్రీవాల్‌ ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్‌ ను విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. 2008-12 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రూ.24.45 కోట్ల వినోదపు పన్నును డీడీసీఏ ఎగ్గొట్టిందని కేజ్రీవాల్‌ ఆరోపిస్తూ దర్యాప్తుకు ఆదేశించారు. అది దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య సిరీస్‌ జరుగుతున్న సమయం కావడంతో అప్పట్లో ఢిల్లీ టెస్టుపై నీలి మేఘాలు అలుముకున్నాయి. అయితే మ్యాచ్‌ నిర్వహణపై హావిూగా కోటి రూపాయిలను ప్రభుత్వానికి చెల్లించాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేయడంతో డీడీసీఏకు ఊరట లభించింది. దీంతో ఆ టెస్టు మ్యాచ్‌ ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగిపోయింది.