కేసీఆర్‌కు ఉద్యోగులు..  కుక్కతోకతో సమానమా?


– టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌
కరీంనగర్‌, సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  తెలంగాణ ఉద్యమంలో పని చేసిన ఉద్యోగులు.. కేసీఆర్‌కు కుక్కతోకతో సమానమా? అంటూ టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉద్యోగులపై ఆదివారం అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు.. కేసీఆర్‌ మాటల గారడీ ఆపాలన్నారు. కరీంనగర్‌కు మెడికల్‌ కాలేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రైతులను కేసీఆర్‌ మోసం చేశారన్నారు. కరీంనగర్‌ను లండన్‌, న్యూయార్క్‌ చేయాల్సిన అవసరం లేదని.. కనీస వసతులు ఇస్తే చాలన్నారు. కేసీఆర్‌ మూడు లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ను ఆకాశం నుంచి భూవ్మిూదకు దించాలని ప్రజలకు పొన్నం ప్రభాకర్‌ పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్‌ మాత్రం రాజకీయాలతో ఇతర పార్టీల నేతలను ఎలా అడ్డుతగిలించుకోవాలని ఆలోచిస్తున్నాడని అన్నారు. కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను విమర్శించే వారంతా తెలంగాణ ద్రోహలు అన్నట్లుగా టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇప్పుడు మంత్రివర్గంలో సంగానికిపైగా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారేనని, వారినెలా కేబినెట్‌లోకి తీసుకున్నారని ప్రశ్నించారు. రాష్టాన్న్రి అభివృద్ధి చేయాలని ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహులంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలు వీడి ప్రజల సమస్యలను
పరిష్కరించేందుకు ప్రతిపక్షాలతో కలిసి ముందుకెళ్లాలని సూచించారు. లేకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని కేసీఆర్‌  హెచ్చరించారు.