కేసీఆర్‌కు బీహార్ సీఎం నితీష్ ఫోన్
– రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో మద్దతివ్వాలని వినతి
– పార్టీ సభ్యులతో చర్చించి నిర్ణయిస్తామన్న కేసీఆర్
హైదరాబాద్,ఆగస్టు 7(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బిహార్ సీఎం నితీష్ కుమార్ ఫోన్‌లో సంభాషించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి కోసం ఎన్టీయే మిత్రపపక్షాల అభ్యర్థిగా జేడీ(యూ) నుంచి బరిలోకి దిగుతున్న తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాల్సిందిగా ఈ మేరకు కేసీఆర్‌ను నితీష్‌కుమార్ కోరారు. ఈ మేరకు మంగళవారం ఉదయం కేసీఆర్‌కు ఫోన్ చేసి.. డిప్యూటీ ఛైర్మన్ పదవి కోసం తమ పార్టీ నుంచి హరివంశ్ నారాయణ్ సింగ్ పోటీ చేస్తున్న విషయాన్ని వివరించి, మద్దతు కోరారు. అయితే.. పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. ఎన్నికల్లో పార్టీ తరఫున సొంత అభ్యర్ధిని నిలబెడితే ప్రాంతీయ పార్టీల మద్దతు పొందడం కష్టమని భావిస్తున్న బీజేపీ నేతలు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలకు ఈసారి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల తరఫున ఇప్పటివరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. టీఎంసీ ఎంపీ సుకేందర్ శేఖర్ రాయ్‌ను బరిలోకి దింపే దింపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది.
9న డిప్యూటీ చైర్మన్ ఎన్నిక..
పీజే కురియన్ పదవీ విరమణతో ఖాళీ అయిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక జరగనుంది. ఆగస్టు 9న ఉదయం 11 గంటలకు డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభం కానుంది. ఆగస్టు 8న మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మొత్తం 245 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్ధిని గెలిపించుకోవాలంటే ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీకి 122 మంది సభ్యుల మద్దతు అవసరం. అన్నాడీఎంకే మద్దతిస్తే? ఎన్డీయే బలం 106కు చేరుకోనుంది. దీంతో డిప్యూటీ ఛైర్మన్ పదవి దక్కించుకునేందుకు బీజేపీ ఇతర పార్టీల మద్దతుకోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్షాలకు 117 మంది సభ్యుల సంఖ్యా బలం ఉంది. ఇటీవలే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీకి చెందిన ఆరుగురు ఎంపీలు కూడా ఇందులో ఉన్నారు. కేవలం ఐదుగురు సభ్యుల మద్దతు కూడగడితే బీజేపీపై సులభంగా గెలవొచ్చన్న ధీమాతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అడుగులు వేస్తోంది.