కేసీఆర్‌ అనుకున్నదొక్కటి…జరుగుతున్నది మరొకటా?

ముఖ్యమంత్రి డెడ్‌లైన్లను బేఖాతరు చేస్తూ  ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా చేస్తున్న సమ్మె విజయవంతంగా సాగుతోంది. అయితే ఈ 36 రోజుల సమ్మెలో ఎవరిది పైచేయి ? ఇప్పటి వరకైతే ఆర్టీసీ కార్మికులదే అని చెప్పక తప్పది. గత ముప్పయ్‌ ఆరు రోజులుగా నెలకొన్న పరిస్థితిలు …జరుగుతున్న పరిణామాలను గమనించిన ఎవరికైనా అదే అనిపిస్తున్నంది. నయానో భయానో  సమ్మె విరమింపజేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించలేదు సరికదా ప్రభుత్వమే అభాసుపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ ఉద్యోగులును ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్‌ తో సమ్మె మొదలైనప్పటికీ ఇప్పుడు అది పక్కకు జరిగి  ఆర్టీసీ ప్రైవేటీకరణ బలంగా తెరవిూదకు వచ్చింది.దాదాపు అన్నిపార్టీలు ..ప్రజా సంఘాలు సమ్మెకు అండగా నిలబడ్డాయి. ఆర్టీసీ సమ్మె రాజకీయ రంగు పులుముకోవటంతో ప్రభుత్వం కూడా మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతుండటంతో సర్వత్రా సర్కార్‌ వైఖరినే తప్పు పడుతున్నారు. కనీసం చర్చలకు కూడా ఆహ్వానించకపోవటం రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఒకప్పుడు ఆర్టీసీకి ఎంతో సన్నిహితుడైన ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖరరావు ఇప్పుడు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. ప్రభుత్వ వైఖరి వెనక ఎవరి ప్రయోజనలు దాగిఉన్నాయన్న ప్రశ్న సామాన్యుడిని వేధిస్తోంది.
ఆర్టీసీ సమ్మెను మొదట చాలా తేలికగా తీసుకున్న  ప్రభుత్వానికి పోను పోను ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.ఓ వైపు పట్టు వదలని విక్రమార్కుల్లా ఆర్‌టీసీ కార్మికులు…ఇంకోవైపు హైకోర్టు అక్షింతలు ..మరో వైపు కార్మికుల ఆత్యహత్యలు. బహుశా ప్రభుత్వ పెద్దలు ఇదంతా ఊహించి ఉండరు. ఇప్పుడు దిగి రావటానికి అహం అడ్డొస్తున్నట్టు కనిపిస్తోంది. చర్చలకు పిలవమని పదే పదే కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు ఎలా దిగివస్తుంది?
ఇదిలావుంటే, గురవారం ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ తీరుపై మరోసారి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు గమనార్హం.  ప్రభుత్వానికి అధికారం ఉన్నట్లే కోర్టులకు కూడా అధికారాలు ఉంటాయనే సంగతి మర్చిపోవద్దని ప్రభుత్వానికి గుర్తు చేయటం తీవ్రతకు అద్దం పడుతోంది. ఈనెల 11లోపు కార్మికులతో చర్చలు జరపని పక్షంలో   తామే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించటం త్వరలో ఏం జరగబోతోందో చూచాయాగా అర్థమవుతోంది. అంతేకాదు, తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికీ ఏపీ ఆర్టీసీలో భాగమేనని …తదుపరి విచారణ వరకు ఎలాంటి రూట్లను ప్రైవేట్‌ పరం చేయడం కుదరదని చెప్పటం ఆర్టీసీ కార్మికులకు తాత్కాలిక ఉపశమనంగా చెప్పుకోవచ్చు. అయితే దీంతో సంబరిపడిపోతే సరిపోదు. ఇది పూర్తిగా సంకేతిక అంశం. తెలంగాణ ప్రభుత్వం సంకేతిక అంశాన్ని పరిష్కరిచటానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. అయితే ఈ విషయంలో కేంద్రాన్ని ఇప్పటికిప్పుడు ఒప్పించగలుగుతుందా అన్నది ప్రశ్న. అది తేలే వరకు తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్న ఆర్టీసీ ప్రైవేటీకరణ సాధ్యం కాకపోవచ్చు.
మరోవైపు, ఆర్టీసీ అంశాన్ని ఎలాగైనా కేంద్ర కోర్టులోకి తీసుకువెళ్లాలని రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో తెలియదు.  ఈ అంశంలో కేంద్ర ¬ం మంత్రి అమిత్‌ షా జోక్యం చేసుకుంటారని వస్తున్న వార్తలు వస్తున్నాయి. టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటును తాము చట్టపరంగా గుర్తించడం లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఏపీఎస్‌ ఆర్టీసీ విభజన ఇంకా పూర్తి కానందున టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటును తాము గుర్తించలేదని అంటోంది. అదే నిజమైతే కేంద్రం అనుమతి లేకుండా తెలంగాణ
ప్రభుత్వం ఒక్క రూట్‌ను కూడా ప్రైవేట్‌ పరం చేయలేదు. అదే జరిగితే ఎప్పుడెప్పుడు ఆర్టీసీని ప్రైవేట్‌  పరంగఆ చేద్దామా అని ఉవ్విళ్లూరుతున్న సీఎం కేసీఆర్‌కు ఇది నిజంగా రెడ్‌ సిగ్నలే. !!

తాజావార్తలు