కేసీఆర్‌ గతం గుర్తు చేసుకో

– ఆర్టీసీ ఉద్యోగులను తొలగించడం సరికాదు
– జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
అమరావతి, అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో తాను
మాట్లాడిన వ్యాఖ్యలను గుర్తుకు తెచ్చుకోవాలని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో జనసేన పార్టీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్ధం చేసుకుని పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలను తీసుకోకూడదని అభిప్రాయపడుతోందని పవన్‌ ఆ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ఆర్‌.టి.సి.ని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన సమ్మె సందర్భంగా 48660 మంది ఉద్యోగులలో 1200 మందిని తప్ప మిగిలిన వారినందరినీ ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు వస్తున్న వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయని పవన్‌ కళ్యాణ్‌ గుర్తుకు చేశారు. తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో భాగంగా పదిహేడు రోజులపాటు నాడు తెలంగాణ పరిధిలోవున్న ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసి ఉద్యమానికి అండగా ఉన్నారని, వారు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవలసి ఉందని పవన్‌ ఈ సందర్భంగా గతాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఉభయులకూ విజ్ఞప్తి చేస్తున్నానని పవన్‌ పేర్కొన్నారు. చర్చల ద్వారా పరిష్కారమైన అనేక సమస్యలను మనం చూశామని, ప్రజలకు కష్టం కలగకుండా చూడవలసిన బాధ్యత మనందరిపైనా వుందన్నారు. ఉద్యోగుల పట్ల ఉదారత చూపాలని, తెలంగాణ ఆర్టీసీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని కేసీఆర్‌ను కోరుతున్నానని పవన్‌ పేర్కొన్నారు.