కేసీఆర్ ఫ్రంట్ బీజేపీ లబ్ధికోసమే
– ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదు
– కమ్యూనిస్ట్‌లపై మోదీ వ్యాఖ్యలు సిగ్గు చేటు
– డిఫెన్స్ ఇండస్ట్రీలో ప్రైవేటీకరణకు అనుమతి దేశ రక్షణకు ముప్పు
– సీపీఐ జాతీయ కార్యదర్శి సుధాకర్‌రెడ్డి
హైదరాబాదు, జనవరి18(జనంసాక్షి) : ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ చేస్తున్న హడావుడి బీజేపీ లబ్ధికోసమేనని, బీజేపీ వ్యతిరేఖ ఓటును తమవైపు తిప్పికొనేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి సువరం సుధాకర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. డిఫెన్స్ ఇండస్ట్రీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 23 నుంచి 25వరకూ నాలుగు సంఘాలకు చెందిన దాదాపు నాలుగు లక్షల మంది కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కార్మికుల సమ్మెకు సీపీఐ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. డిఫెన్స్ ఇండస్ట్రీలో ప్రైవేటీకరణకు అనుమతించడంవల్ల దేశరక్షణకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. అంతేకాక మోదీ కక్షపూరితంగానే ఆలోక్ వర్మను ట్రాన్స్‌ఫర్ చేయించారని ఆరోపించారు. ఆలోక్ విషయంలో పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాక కేరళలో కమ్యూనిస్ట్‌లపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. జేఎన్‌యూ విద్యార్థులపై అక్రమంగా నమోదు చేసిన చార్జిషీట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్ నుంచి ఫిరాయిస్తే ఒకరకంగా.. టీఆర్‌ఎస్‌లోకి వెళ్తే మరోరకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారని ఫిర్యాదు అందగానే ఆఘమేఘాల విూద చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని విలీనం చేయడం పద్దతి కాదని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. శాసన సభలను ఔన్నత్యంగా నడపాలని కోరారు.