కేసీఆర్ రాచరిక పాలనకు.. ప్రజలే స్వస్తిచెబుతారు
– ప్రతిపక్ష నేతలపై ప్రభుత్వం కుట్ర పన్నుతోంది
– రాజకీయంగా ఎదుర్కోలేక కేసులు బనాయిస్తుంది
– తెరాస నేతలకు భవిష్యత్‌లో ఇదే పరిస్థితి ఎదురవుతుంది
– విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేత డీకే అరుణ
హైదరాబాద్, సెప్టెంబర్28(జనంసాక్షి) : కేసీఆర్ రాచరిక పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ప్రతిపక్ష పార్టీల నేతల పై రాజకీయ వేధింపులు ఆపకపోతే తగిణ గుణపాఠం తప్పదని మాజీ మంత్రి, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-కన్వీనర్ డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి నివాసాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో శుక్రవారం ఉదయం డీకే అరుణ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అక్కడే ఆమె విూడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలపై తెలంగాణ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలు తెరాస ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతోనే తెరాస నేతలు కుట్రలకు తెరదీశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో గట్టిగా మాట్లాడే నేతలను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడుతోందని డీకే అరుణ్ ఆరోపించారు. మొన్న జగ్గారెడ్డి, నేడు రేవంత్‌రెడ్డి ఘటనలే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు. అందరూ తనకు బానిసలుగా ఉండాలన్న కేసీఆర్ రాచరిక పాలనకు తెలంగాణ ప్రజలు త్వరలోనే తెరదించుతారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ ఇంతటి దారుణం చూడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇదే ఒరవడి అమలు చేస్తే విూ పరిస్థితి ఏంటో తెరాస నేతలు ఆలోచించుకోవాలని అరుణ హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పాటైన రాష్ట్రంలో.. ప్రజావ్యతిరేక పాలన కొనసాగుతోందని డీకే అరుణ విమర్శించారు. ప్రభుత్వం అడ్డగోలుగా చేస్తున్న పనులకు అధికారులు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు, కలెక్టర్లు నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. ప్రతిపక్ష నేతలపై కుట్రలకు పాల్పడుతున్న తెరాసకు భవిష్యత్‌లో అదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. భాజపాతో కుమ్మక్కైన అధికార పార్టీ.. రాష్ట్రంలో ఇతర పార్టీలు నిలదొక్కుకోకుండా కుట్రలకు పాల్పడుతోందన్నారు. సహారా కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కేసీఆర్‌ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ఆమె ప్రశ్నించారు. జగ్గారెడ్డిని అరెస్టు చేసిన కేసులో పలువురు తెరాస నేతల పేర్లు వినిపించినా ఎందుకు చర్యలు తీసుకోలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కోవాలని, కుట్రలు చేసి కేసులు బనాయించాలని చూస్తే చూస్తూ ఊరుకోమని డి.కె. అరుణ హెచ్చరించారు.