కేసీఆర్‌ సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడంలేదు

` నిజాయితీ నిరూపించుకునేందుకైనా విచారణ జరిపించుకోండి
` డిసెంబర్‌ 9 తర్వాత బాధ్యుల తాటా తీస్తాం
` ఎన్నికల పర్యటనకొచ్చే మోడీ.. ప్రాజెక్టును సందర్శించడం లేదెందుకు?
` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌ (జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్ని తానే అని రక్తం ధారపోసి కట్టానని కేసీఆర్‌ చెప్పుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆయనపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రణాళిక ప్రకారం డిజైన్‌ చేయలేదని, నిర్మాణంలో నాణ్యత పాటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇంత జరిగినా సీఎం కేసీఆర్‌ కాళేశ్వరంపై నోరు మెదపలేదు. నిర్మాణంలో లోపాలు, అవినీతి జరిగిందనే ప్రభుత్వం వివరాలను దాచిపెట్టిందని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఒప్పందంలో ఒక రేటు తర్వాత పనులు ప్రారంభించిన తర్వాత రివైజ్డ్‌ పేరిట అంచనాలను పెంచుకుంటూ కవిూషన్లను దండుకుంటున్నారని ఆరోపించారు. సీతారామ ప్రాజెక్టును ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. కాళేశ్వరం జరిగిన అవినీతి కేంద్రం ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై కేంద్ర ఎందుకు మౌనంగా ఉంటోందని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల ప్లానింగ్‌ వేరు, నిర్మాణం వేరు కాబట్టే మునిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధారిటీ అడిగే ప్రశ్నలకు కేసీఆర్‌ సమాచారం ఇవ్వడం లేదని రేవంత్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కేసీఆర్‌ని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది అన్నారు. మోడీ ఎన్నికల పర్యటనకు వస్తున్నారు కానీ.. కూలిన ప్రాజెక్టు చూడడానికి ఎందుకు రావడం లేదు? అని ప్రశ్నించారు. డిసెంబర్‌ 9 తర్వాత కాళేశ్వరం బాధ్యుల తాటా తిస్తామన్నారు. ప్రాజెక్టు అంచనాలు, పెంచిన వ్యయం, ఖర్చు.. ఈ మూడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.