కేసుల ఎత్తివేత..మరణించిన కుటుంబాలకు పరిహారం
రైతు సంఘాల భేటీలో రైతునాయకుల పట్టు
ప్రభుత్వ నిబంధనలపైనా చర్చ
న్యూఢల్లీి,డిసెంబర్7 (జనంసాక్షి) :
కేసుల ఎత్తివేత,మరణించిన రైతులకు పరిహారం తదితర అంశాలపై రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. రైతుల ఆందోళనకు ముగింపు పలకాలన్న నిర్ణయానికి వచ్చినా.. ఈ సమస్యలపై తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పంపిన డ్రాప్ట్ లెటర్ పై ఎటూ తేల్చుకోకుండానే రైతు సంఘాల భేటీ ముగిసింది. ఎమ్మెస్పీని నిర్ణయించడానికి చట్టబద్ధమైన ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని, రైతులపై ఉన్న కేసులు ఎత్తేస్తామని కేంద్రం ఓ డ్రాప్ట్ లెటర్‌ను రైతు నేతలకు పంపింది. ఈ డ్రాప్ట్ లెటర్ పై చర్చించడానికి సంయుక్త కిసాన్ మోర్చా ఢల్లీి సరిహద్దుల్లోని సింఘూ సరిహద్దులో సమావేశమైంది. అయితే ఎలాంటి నిర్ణయమూ తీసుకోకుండానే ఈ సమావేశం ముగిసింది. బుధవారం మరోసారి సమావేశమై, కేంద్రం పంపిన డ్రాప్ట్ లెటర్‌పై చర్చిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. ఈ సమావేశం తర్వాతే.. ఆందోళన విరమణపై సంయుక్త కిసాన్ మోర్చా అధికారికంగా ఓ ప్రకటన చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఇక.. సమావేశం ముగిసిన తర్వాత సంయుక్త కిసాన్ మోర్చాకు సంబంధించిన ఓ నేత మాట్లాడారు. తాము ఉద్యమాన్ని పూర్తిగా నిలిపేస్తేనే తమపై ఉన్న కేసులు ఎత్తేస్తామని ప్రభుత్వం అంటోందని, దీనిపై తమకు అభ్యంతరాలున్నాయని అన్నారు. కేసుల ఎత్తివేత అనేది అతి తొందరగా ప్రారంభం కావాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై తాము కొన్ని సవరణలను కూడా సూచించామని, పంజాబ్ తరహాలో మరణించిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసింది.