కైట్ ఫెస్టివల్‌తో సందడేసందడి
భోగిమంటలతో గ్రామాల్లో పండగ వాతావరణం
కోస్తాలో కోడిపందాల జోరు
హైదరాబాద్,జనవరి14(జనంసాక్షి): తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతోంది. పాడిపంటలకు, సంప్రదాయాలకు పెట్టిందిపేరైన తూర్పు వాకిట సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇంటి ముంగిట ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, కొత్త అల్లుళ్లకు స్వాగతం, నోరూరించే పిండివంటలు, గాలి పటాలతో, చిన్నారుల సందడితో పల్లెల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. ఆదివారం భోగి పండుగ సందర్భంగా గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా ఉదయమే భోగి మంటలు వేశారు. చిన్నా, పెద్దా అందరూ భోగి మంటల వద్ద చలి కాచుకున్నారు. నగరాల్లో ఉంటున్న వారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెల్లో నెలకొన్న సందడి అంతాఇంతా కాదు. ఉదయం చిన్నారులు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని భోగి దండలు మంటల్లో వేసి మురిసిపోయారు. తెలంగాణలో సంక్రాంతి సందడి అంబరాన్నంటుతున్నది. భోగి పండుగ సందర్భంగా గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్న తేడా లేకుండా ఉదయమే భోగి మంటలు వేశారు. చిన్నా, పెద్దా అందరూ భోగి మంటల వద్ద చలి కాచుకుని ముచ్చట్లు చెప్పుకున్నారు. నగరాల్లో ఉంటున్న వారు పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఉదయం చిన్నారులు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని భోగి దండలు మంటల్లో వేసి మురిసిపోయారు. తెలంగాణ వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా కొనసాగాయి. సంక్రాంతి వేడుకల్లో భాగంగా కైట్ ఫెస్టివల్ గ్రాండ్‌గా కొనసాగుతున్నది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్, హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజాలో విదేశీయులు, చిన్నారులు, యువత, ఔత్సాహికులు రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తూ సందడి చేసారు. నగరంలోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో కైట్ ఫెస్టివల్ కొనసాగుతోంది. పతంగుల పండుగ కోసం విదేశీ కైట్ ప్లేయర్స్ నగరానికి వచ్చారు. దీంతో పరేడ్ గ్రౌండ్ సందడిగా మారింది. విభిన్న రకాలలో తయారు చేసిన పతంగులను ప్రదర్శిస్తున్నారు. పరేడ్‌గ్రౌండ్‌లో జరుగుతున్న కైట్ ఫెస్టివల్ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
కోస్తాలో కోళ్ల పందాలకు మొదలు
కోస్తా వ్యాప్తంగా కోడిపందేలు ప్రారంభమయ్యాయి. కోడిపందేలపై పోలీసులు ఆంక్షలను సడలించడంతో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందాలు ప్రారంభమయ్యాయి. లక్షల రూపాలయల్లో పందేలు జరుగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి పందెంరాయుళ్లు ఈ ప్రాంతాలకు చేరుకుని లాడ్జీల్లో ఉంటున్నారు. కాగా… కోడిపందేల మాటున గుండాట, కోతముక్క, లోపల బయట ఆటలు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి కోడిపందేలపై పోలీసులు ఆంక్షలు సడలించడంతో పందెం రాయుళ్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాజమండ్రి అర్బన్ పరిధిలో పందాలపై ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. కోడిపందాలు, గుండాట నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే… కోడిపందాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసినట్లు ఎస్పీ తెలిపారు. ఆంక్షలు అమలులో ఉన్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఎక్కడా గుంపులుగా ఉండకూడదన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కోడి పందేల కాసే బరుల వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు. కోడి పందేలను నిర్వహించడానికి నిర్వాహకులు బరుల వద్ద అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి కోడి పందేలను నిర్వహించకుండా అడ్డుకున్నారు.