కొండా దంపతులకు గుణపాఠం తప్పదు: వినయ్
వరంగల్,సెప్టెంబర్28(జనంసాక్షి): టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబంపై కొండా దంపతులు చేస్తున్న ఆరోపణలు మానుకోవాలని తాజామాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మారోమారు హెచ్చరించారు. కొండా దంపతులు రాజకీయంగా టీఆర్‌ఎస్ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర సాధన కోసం అనేక మంది అమరులయ్యారని, వారి త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న విషయాన్ని కొండా దంపతులు గుర్తుంచుకోవాలన్నారు. 2014 కు ముందు వైఎస్సార్‌సీపీలో ఉన్న కొండా దంపతులు తెలంగాణ ఉద్యమకారులపై దాడులు చేసిన విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలుసునన్నారు. తెలంగాణలో ఆ పార్టీ భూ స్థాపితం కాగానే కొండా దంపతులు టీఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చారని, అప్పుడు సీఎం కేసీఆర్ కొండా సురేఖకు టిక్కెట్ ఇచ్చి, కొండా మురళికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన విషయాన్ని మర్చిపోయి నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. తమకు రాజకీంగా భిక్షపెట్టింది టీఆర్‌ఎస్ పార్టీ అన్న విషయాన్ని వారు మర్చిపోయి మట్లాడుతున్నారని ధ్వజమోత్తారు. మంత్రి పదవి కోసమే కొండ దంపతులు టీఆర్‌ఎస్ పార్టీలోకి వచ్చారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వందకు పైగా సీట్లు గెలుచుకుంటుందని, కొండ దంపతులు పార్టీకి దూరమైనంతమాత్రన ఒరిగేదేమి లేదన్నారు. రాబోయే రోజుల్లో కొండ దంపతులకు రాజకీయంగా శూన్యమేనని ఆయన జోస్యం చెప్పారు.