కొండా దంపతులు ఉద్యమ ద్రోహులు

టిఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేవిూ లేదన్న సారయ్య,వినయ్‌
వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): కొండా సురేఖ దంపతులపై మాజీ మంత్రి బస్వరాజు సారయ్య,మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌లు  మరోమారు విమర్శల దాడి చేశారు. దంపతులిద్దరూ తెలంగాణ ఉద్యమ ద్రోహులంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారు ఎలాగూ పార్టీ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకునే విమర్శలు చేశారని అన్నారు.  పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం వల్లే తెరాస అధిష్ఠానం టికెట్టు ఇవ్వలేదన్నారు. వారిద్దరినీ చేర్చుకునే రాజకీయ పార్టీలకు వినాశనం తప్పదని హెచ్చరించారు. తెరాసపై కొండా దంపతుల వ్యాఖ్యలను నిరసిస్తూ వరంగల్‌లో తెరాస శ్రేణులు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ..’ రాజీకీయ ద్రోహులంటే కొండా దంపతులే. వీరిద్దరూ తెలంగాణ ఉద్యమ ద్రోహులు. కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీశ్‌ రావులను విమర్శించే అర్హత వాళ్లిద్దరికీ లేదు. ఈ ఎన్నికల తర్వాత వారిద్దరినీ ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టే ప్రసక్తేలేదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి వాళ్లను పార్టీలో చేర్చుకున్న ఏ పార్టీ పైకి రాలేదు’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. తెలంగాణలో ద్రోహులకు స్థానం లేదని వినయ్‌ భాస్కర్‌ అన్నారు. వారు వెళ్లాలనే నిర్ణయించుకుని టిఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారని మండిపడ్డారు. వారికి గుణపాఠం తప్పదన్నారు.

తాజావార్తలు