కొండా దంపతుల  చేరికతో మారనున్న ఓరుగల్లు ముఖచిత్రం

పరకాలలో మళ్లీపోటీ చేయనున్న సురేఖ
సీట్ల కేటాయింపుపై దక్కని హావిూ
వరంగల్‌,సెప్టెంబర్‌26(జ‌నంసాక్షి): నాలుగైదు రోజుల్లో భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్న కొండా దంపతులు అనూహ్యంగా ఒక్కరోజులోనే కాంగ్రెస్‌ గూటికి చేరారు. మంగళవారం హైదరాబాద్‌లో  సిఎం కెసిఆర్‌పై, కెటిఆర్‌పై విమర్శలు గుప్పించి 24 గంటలు కూడా గడవకముందే వరంగల్‌ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్‌  గూటికి చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కొండా మురళి, సురేఖ కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. వారు తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారన్న వార్తలు గత పక్షం రోజులుగా ఓరుగల్లులో షికారు చేయగా, నేడవి నిజమయ్యాయి. గత పక్షం రోజులుగా వారు కాంగ్రెస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. పిసిసి నేతలు ఉత్తమ్‌, జానారెడ్డి తదితరులు  ఢిల్లీలోనే ఉండడంతో  కొండా దంపతులు కాంగ్రెస్‌లో చేరారు. వీరి చేరికతో ఓరుగల్లు కాంగ్రెస్‌లో సవిూకరణాలు మారనున్నాయి. సొంత బలం,బలగం ఉన్న వీరి రాకతో కాంగ్రెస్‌లో పునరుత్తేజం రానుంది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కొండా సురేఖ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తదనంతర పరిస్థితుల దృష్ట్యా తెరాసలో చేరారు. ఇటీవల కేసీఆర్‌ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్తున్నట్లు ప్రకటించిన  అనంతరం అదేరోజు  ఆయన 105 మంది పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించారు. అయితే ఆ జాబితాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ పేరు లేదు. దీంతో పార్టీ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేసి రెండ్రోజుల్లో తనకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. అయినప్పటికీ తెరాస నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విూడియా సమావేశం ఏర్పాటుచేసి తెరాసపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో దొరల పాలన సాగుతోందని, ఉద్యమంలో పాల్గొన్న వారికి సరైన ప్రాధాన్యం లభించలేదని సురేఖ ఆరోపించారు. బీసీ మహిళ అయిన తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోయినా పార్టీకి సేవ చేశానని.. అయినా తనకు ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా నమ్మక ద్రోహం చేశారని, ఒక్క మహిళామంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్‌కు మహిళలపై ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తోందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు 10పేజీల లేఖను విడుదల చేశారు. తాను, తన భర్త ఎమ్మెల్సీ కొండా మురళి తెరాసకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు జరిపిన వారిద్దరూ గత రాత్రే దిల్లీకి చేరుకున్నారు. బుధవారం  ఉదయం 11.30 గంటల సమయంలో రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరి చేరికతో వరంగల్‌ కాంగ్రెస్‌లో కొంత ఉత్తేజం కనిపించనుంది. తమకు మూడు స్థానాలు కేటాయించాలని కోరుతున్నా.. మహాకూటమి సర్దుబాటు దృష్ట్యా అన్ని సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ముందస్తు సీట్ల హావిూ లేకుండా పార్టీలో చేర్చుకున్నట్లు సమాచారం. అయితే  కొండా సురేఖకు సీటు ఖాయమని పార్టీ హావిూ ఇచ్చినట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఐదు స్థానాలను ప్రభావితం చేయగల కొండా దంపతులు తిరిగి సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం నెలకొంది. పరకాలతో పాటు వరంగల్‌ తూర్పు, భూపాలపల్లి సీటును కొండా దంపతులు కోరుతున్నారు. పరకాలలో యధావిధిగానే కొండా సురేఖ పోటీ
చేయడం ఖాయం కానుంది. తనకూతురును భూపాలపల్లిలో దింపాలనుకున్నా సాధ్యం కాకపోవచ్చు.

తాజావార్తలు