కొత్తగూడెంలో ఉద్రిక్తత

– అసమ్మతి నేత ఎడవల్లి కృష్ణ ఇంటికెళ్లిన వనమా కుమారులు

– వారిని అడ్డుకొని ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్న కృష్ణ సతీమణి

– పోలీసుల రంగప్రవేశంతో సద్దుమణిగిన ఉద్రిక్తత

– బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న ఎడవల్లి కృష్ణ

కొత్తగూడెం, నవంబర్‌15(జ‌నంసాక్షి) : భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్‌లో టికెట్‌ లొల్లి తారాస్థాయికి చేరింది. మహాకూటమిలో భాగంగా కాంగ్రెస్‌ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావుకు టికెట్‌ దక్కింది. ఇదే స్థానంలో కాంగ్రెస్‌ నుండి టికెట్‌ ఆశించిన ఎడవల్లి కృష్ణకు అధిష్టానం మొండి చేయి చూపింది. దీంతో నియోజకవర్గంలోని ఎడవల్లి కృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుండి తనకు టికెట్‌ ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వర్గీయులుసైతం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గురువారం కొత్తగూడెంలో మరో హైడ్రామా చోటుచేసుకుంది. వనమా-ఎడవల్లి స్వయానా తోడళ్లల్లు కావడంతో ఆయన్ని బుజ్జ గించేందుకు వనమా కుమారులు ఎడవల్లి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎడవల్లి అనుచరులు వారిని లోపలికి అనుమతించలేదు. తమ ఇంట్లోకి వనమా కుటుంబసభ్యులు రావొద్దంటూ కృష్ణ సతీమణి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి చేరుకున్న పోలీసులు వనమా కుమారులను బయటకు పంపించివేశారు. అనంతరం కొత్తగూడెంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన ఎడవల్లి కృష్ణ హుటాహుటిన సీపీఎం కార్యాలయానికి వెళ్లి బీఎల్‌ఎఫ్‌లో చేరారు. కొత్తగూడెంలో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. దీంతో కొత్తగూడెం రాజకీయాలు ఎడవల్లి కృష్ణ వర్సెస్‌ వనమా వెంకటేశ్వరరావు అన్నట్లుగా మారాయి. ఇదే నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా జలగం వెంకట్రావ్‌ బరిలో నిలిచారు. జలగం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే రెండు విడుదలుగా నియోజకవర్గంలో జలగం ప్రచారాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఎడవల్లి కృష్ణ కాంగ్రెస్‌ను వీడటంతో అతని అనుచరులు కాంగ్రెస్‌ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామాలు కొత్తగూడెం నియోజకవర్గంలో కూటమికి పెద్ద దెబ్బగా మారినట్లు తెలుస్తోంది. మరోవైపు కూటమిలో విబేధాలతో తెరాస అభ్యర్ధి గెలుపు సునాయాసంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.