కొత్త పంచాయితీలతో ఆశావహుల రంగప్రవేశం

 

చురుకుగా ఎన్నికల ప్రచారంలో నేతలు

భద్రాద్రికొత్తగూడెం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): కొత్త పంచాయతీల ఏర్పాటు కారణంగా వచ్చే ఎన్నికల నాటికి సర్పంచ్‌లు, వార్డుల సంఖ్య భారీగా పెరగనుంది. దీంతో గ్రామాల్లో రాజకీయంగా టిఆర్‌ఎస్‌కు కలసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో సర్పంచ్‌ పదవులు ఆశిస్తున్న వారు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. వీరంతా అధికార టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తరపున ప్రచారంలో దూసుకుని పోతున్నారు. గ్రావిూణ పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ప్రభుత్వం సంకల్పానికి అనగుణంగా ప్రస్తుతం ఉన్న పంచాయతీల పరిధిలోని తండాలను, గూడాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదింప జేయడంతో కొత్తగా పలు పంచాయితీలు ఏర్పడ్డాయి. గ్రామ పంచాయతీలకు నిధులు, విధులు కేటాయించడమే కాకుండా అనుకున్న సమయానికే ఎన్నికలు నిర్వహించేలా హైకోర్టు కూడా ఆదేవించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక పంచాయితీ ఎన్నికలకు కసరత్తు జరుగనుంది. గ్రామాల్లో సమస్యల సత్వర పరిష్కారంతో పాటు పంచాయతీలు వేదికగా అన్ని సౌకర్యాలను, మౌలిక వసతులను కల్పించడంతో పాటు జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు కుల, ఆధాయ, నివాస ధ్రువీకరణ పత్రాలను కూడా ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ గ్రామ పంచాయతీల్లోనే పొందే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి రానున్నాయి. కొత్త పంచాయతీల ఏర్పాటుతో ప్రజల ముంగిట్లోకి ఊహించని రీతిలో పరిపాలనా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఉన్న 205 పంచాయతీలకు తోడు అదనంగా కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి. దీంతో పరిపాలనా సౌలభ్యంతో పాటు వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలు అభివృద్ది చెందడంలో కీలక భూమిక కానున్నాయి. కొత్తగా అనేక మందికి సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్‌లు అయ్యే అవకాశాలు కూడా లభించనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త పంచాయతీల ఏర్పాటుతో అనేకులు ఆశావహులుగా ఉన్నారు. వీరంతా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.