కొత్త రాజ్యసభసభ్యుల ప్రమాణం

5

న్యూఢిల్లీ,జూన్‌ 28(జనంసాక్షి):  తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. దిల్లీలోని పార్లమెంట్‌ భవనంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికైన సురేశ్‌ ప్రభు, విజయసాయిరెడ్డి, తెలంగాణ నుంచి ఎన్నికైన డి.శ్రీనివాస్‌, కెప్టెన్‌ లక్ష్మీకాంతారావుతో రాజ్యసభ ఛైర్మన్‌ హవిూద్‌ అన్సారీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, పలువురు ఎంపిలు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా డి. శ్రీనివాస్‌ ప్రమాణస్వీకారం చేశాక విూడియాతో మాట్లాడారు. రాష్ట్ర సమస్యలను రాజ్యసభలో ప్రస్తావిస్తానని చెప్పారు. బంగారు తెలంగాణ సాధనలో ఎంపీగా సీఎం కేసీఆర్‌కు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. సీఎం ఆలోచనల మేరకు ముందుకు సాగుతామన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన అవకాశంతో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు తనను టీఆర్‌ఎస్‌ వైపు నడిపించాయని పేర్కొన్నారు. తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికవడం ఆనందంగా ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తెలిపారు.  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున తాను మొదటివాడిగా రాజ్యసభలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలకు విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యత్వాన్ని అలంకారంగా భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు.