కొనసాగిన సింగరేణి కార్మికుల సమ్మె

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సంఫీుభావం

కరీంనగర్‌,డిసెంబర్‌10(జనం సాక్షి): సింగరేణి సంస్థకు చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. వీటిని వేలం వేయొద్దని సింగరేణి కార్మికులు సమ్మెకు దిగారు. ఈ సమ్మెకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సంఫీుభావం తెలిపారు. ఆయనతోపాటు పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు వెంకటేష్‌, రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి కూడా ఈ సమ్మెకు సంఫీుభావం తెలుపుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం సింగరేణి జీడీకే 2 గనిని వీరంతా సందర్శించారు. ఈ సందర్భంగానే సమ్మెకు మద్దతు తెలుపుతూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాగా, బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా చేపట్టిన సింగరేణి సమ్మె.. శుక్రవారం నాడు రెండో రోజుకు చేరింది. సంస్థలోని అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెకు మద్దతు ప్రకటించడంతో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దీంతో నాలుగు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడిరది. 40 కోట్ల రూపాయలు కార్మికుల వేతనాలకు నష్టం వాటిల్లింది. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో మూడు రోజులపాటు సమ్మెకు జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.