కొనసాగుతున్న ఆందోళన
ఆదిలాబాద్‌్, జనవరి 30 (: తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రోజుకో మాట మాట్లాడుతుండడంతో తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్రం మరోసారి మాట తప్పినప్పటికీ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోగా కేంద్రానికి మద్దతుగా ప్రకటనలు చేయడాన్ని వారు ఖండించారు. ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలోకి రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా తెలంగాణ కోసం ప్రజల ఉద్యమిస్తున్న మరోవైపు విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడుతున్నా కాంగ్రెస్ నాయకులు తమ పదవులే ముఖ్యంగా భావిస్తున్నారని వారు విమర్శించారు. రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించకపోతే గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులను తిరగనివ్వమని వారు హెచ్చరించారు. కాగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ ఐకాస ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 1123 రోజుకు చేరుకున్నాయి.