కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు

ఆదిలాబాద్‌, జనవరి 28 (): తెలంగాణపై కేంద్రం మాటతప్పడాన్ని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా తెలంగాణవాదులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కేంద్రప్రభుత్వం, కేంద్రమంత్రులు ఆజాద్‌, షిండేల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించారు. కేంద్రం గడువు విధించి తెలంగాణ రాష్ట్రం ప్రకటించకుండా జాప్యం చేస్తున్నందున కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో భూస్థాపితం చేయడంతో పాటు కాంగ్రెస్‌ నాయకులను గ్రామాల్లోకి రానివ్వమని వారు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటులో కేంద్రం వహిస్తున్న నిర్లక్ష్యానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పదవులకు, పార్టీకి రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్‌ చేస్తున్నారు. సోమవారం జిల్లావ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, గిరిజన సంఘాలు ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. కేంద్రం ప్రకటించిన మేర వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని, లేనట్టయితే జరగబోయే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాలని వారు డిమాండ్‌ చేశారు. పదవులు అట్టుపెట్టుకొని వేలాడుతున్న కాంగ్రెస్‌ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. న్యాయవాదులు విధులను బహిష్కరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.